బాహుతల్లి
ప్రభుత్వ ఆసుపత్రులంటే కొంతమందికి గౌరవం ఉండదు. అది వారి అనుభవాల నుంచి వచ్చిన విరక్తే... అంతేకాకుండా మీడియాలో తరచూ వచ్చే కథనాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని మసకబార్చాయి. ఈ జబ్బుకు నల్లగొండ డాక్టర్లు చికిత్స చేశారు. ఆ జిల్లాకే కీర్తిని తెచ్చారు. లాంగ్ లివ్ ద స్పిరిట్ ఆఫ్ నల్లగొండ!
బాహువులు అంటే భుజాలు. అవి బలంగా ఉంటే ఎంత బాధ్యతనైనా మోయగలం. బాహువులు బలంగా ఉండడానికి కావలసింది కండలు కాదు... కమిట్‌మెంట్! నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి నిజంగా బాహుబలి. అసలైన బాహుతల్లి!
ఆరున్నర నెలల గర్భిణికి హైబీపీ వచ్చింది. హుటాహుటిన ఆ ఊళ్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి వైద్యులు పాపను ఈలోకంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ చిన్నారి బరువెంతో తెలుసా? కేవలం 650 గ్రాములు. మనం వాడుకున్న సెల్‌ఫోన్ కంటే కొంచెం ఎక్కువ బరువు. అంతే. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే తమ వల్ల కాదు పొమ్మన్నారు అక్కడి వైద్యులు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్దామంటే లక్షల్లో ఖర్చు. అయినా బతుకుతుందన్న గ్యారంటీ లేదు. ఏమైతే అదవుతుందిలే! పాపను రక్షించుకునేందుకు తమ పరిధిలో ప్రయత్నిద్దామని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ పాప తల్లిదండ్రులు.
ఆ పాప పేరు రుషిత. ఆ చిన్నారి తల్లి పేరు మమత, తండ్రి శంకర్. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరిక కొండారం వాళ్ల ఊరు. వాళ్ల ఆర్థిక స్థాయికి అక్కడి నుంచి పాపతో జిల్లా కేంద్రానికి రావడమే గగనం. హైదరాబాద్‌కు వెళ్లడమనే మాటే వాళ్లకు గగనకుసుమం. అందుకే గగన కుసుమాన్ని జిల్లా కేంద్రంలోనే పూయించారు అక్కడి డాక్టర్లు. దాంతో ఇప్పుడా సుమసౌరభాలు ఇప్పుడు నల్లగొండ నుంచి నలుదిక్కులకూ వ్యాపించాయి. త్వరగా లోకం చూసిన ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రభుత్వ వైద్యులు పడిన ప్రయాసతో వారి ప్రతిభ, అంకితభావం లోకానికి వెల్లడయ్యాయి.
త్వరపడి జగతికి వచ్చిన చిన్నారిని రక్షించేందుకు... ఈ భూమి మీదనే ఉంచేందుకు... భూమ్యాకాశాలను ఏకం చేసేంతగా శ్రమించారు సర్కారీ వైద్యులు. వారు పడ్డ శ్రమ ధరాతలంలో ధన్వంతరుల కీర్తి ధన్యమయ్యేలా చేసింది. ప్రభుత్వ డాక్టర్ల పట్ల మరింత గౌరవం పెంపొందేలా చేసింది. రుషితను బతికించుకున్న వైద్యసిబ్బంది బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దామెర యాదయ్య తాము ఆ చిన్నారి ప్రాణాలను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఇలా వివరిస్తున్నారు.
బిడ్డ ఉండే కాల వ్యవధి తొమ్మిది నెలలు. వారాల్లో చెప్పాలంటే 36 వారాలు. ఇలా పూర్తి కాలం కడుపులో ఉండి, ఆ తర్వాత ప్రసవం అయితే దాన్ని ఫుల్ టర్మ్ డెలివరీ అంటారు. కొందరిలో మమత లాంటి కారణాలతో ఈ లోపే ప్రసవం జరగవచ్చు. దాన్ని ‘ప్రీ మెచ్యూర్ డెలివరీ’ అనీ, ఈ బిడ్డలను ‘ప్రి మెచ్యూర్ బేబీస్’ అని అంటారు. సాధారణంగా పూర్తిగా నెలలు నిండాక పుట్టిన పిల్లలు... కనీసం 2,500 గ్రాముల బరువుకు కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. అలాకాకుండా 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను ‘లో బర్త్ వెయిట్ బేబీస్’ గా పరిగణిస్తారు.
రుషిత పుట్టినప్పుడు బరువు కేవలం 650 గ్రాములు మాత్రమే. పైగా ఆ బిడ్డ కడుపులో ఉన్నది కేవలం ఆరున్నర నెలలు మాత్రమే. పాప బతుకుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే కన్నవాళ్లూ నమ్మకం పెట్టుకోలేదు. ఇక్కడే వదిలారు. మొదటి మూణ్ణాలుగు రోజులూ మేమూ సాధారణ చికిత్స మాత్రమే చేశాం. కానీ ఆ చికిత్సకే పాప అసాధారణంగా స్పందించింది. తన మనుగడను సుసాధ్యం చేసుకుంది.
ఎంత కష్టం... మరెంత ప్రయాస...
ఇలా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు ఆహారం తీసుకోవడం కష్టం. పైగా ఫార్ములా పాలు వాళ్లకు సరిపడవు. పుట్టిన పాపలకు చనుబాలకు మించిన ఆహారం లేదు. ఆ పిల్లను బతికించుకోడానికి డాక్టర్లుగా మేం ఎంతగా యాతన పడ్డామంటే... తోటి తల్లులు తమ బిడ్డకు పాలు పట్టాక మిగిలినవి సేకరించాం. ఉగ్గుతో ఓరిమితో పాలు పట్టాం. అలా రుషితకు ఎందరో తల్లులు కూరిమితో తమ చనుబాలిచ్చి ఆ చిన్నారి తనువు నిలిపారు. ఒకదశలో పాలు పట్టడం కష్టమైతే ఆమైనో ఆసిడ్స్, లిపిడ్స్ వంటివి అందించాం.
శ్వాసకు ఇబ్బంది కాకుండా ఉండటం కోసం ఇంజక్షన్‌గా కెఫీన్. మొదట్లో తల్లి మమతకు నేరుగా చనుబాలివ్వడం సాధ్యపడలేదు. గోమాత నుంచి పితికినట్లుగా తల్లి నుంచి పాలు పిండి సేకరించాం. గొట్టాలతో కడుపులోకి పంపించాం. తొలుత ఎంత పాలుపట్టేవాళ్లమో తెలుసా? కేవలం 2 - 5 ఎం.ఎల్. మాత్రమే. క్రమంగా 15-20 ఎం.ఎల్. పాలను రెండుగంటలకోసారి, ఆ తర్వాత గంటకోసారి తాగే వరకు పాప పెరిగింది. కొద్దికొద్దిగా అలవాటు చేసి ఇప్పుడు తల్లిలో మురిపాలతో పాటు ముర్రుపాలూ ఊరేలా చేశాం. అవి బిడ్డకు అందేలా చూశాం.
కంటిచూపునూ కాపాడారు...
నెలలు నిండకుండానే పుట్టిన ఆ బిడ్డను కంటిపాపలా కాపాడుకునే సమయంలోనే బిడ్డ కంటికి ఏదో సమస్య ఉందని తెలిసింది. ఏమాత్రం ఆలసించినా రేపుమాపు ఆ బిడ్డకు చూపు కరవవుతుందని అర్థమైంది. కారణం... ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్న రెటీనా నరాలు. వాటితో పాటు పోటీగా పెరుగుతున్న మా టెన్షన్! మా దగ్గర ఉన్న డాక్టర కస్తూరి చందు పరీక్షలు చేసి పాపను పరిశీలించారు. అంతటి చిన్న బిడ్డను హైదరాబాద్‌కు తీసుకెళ్లే పరిస్థితి లేదు.తల్లి మమత పొత్తిళ్లలో చిన్నారి రుషిత
దాంతో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి లేఖ రాశాం. అక్కడి డాక్టర్ సుభద్ర జలాలే తక్షణం స్పందించారు. మర్నాడు వచ్చేశారు. ఒక్కొక్క కంటికి రెండున్నర గంటల ఆపరేషన్. లేజర్‌తో మేజర్ చికిత్స. అలా పెద్ద డాక్టర్లనే పాప దగ్గరికి రప్పించాం. చికిత్స ఇప్పించాం. డాక్టర్ సుభద్ర పాపపై తన చూపు నిలిపారు. పాప చూపును నిలిపారు. ఇప్పుడా బిడ్డ తాను త్వరపడి వచ్చిన ఈ లోకాన్ని చూస్తోంది. అలా మేం ఆ పాపను చూస్తుంటే మాకు ఆనందం. కను కొనలలో, కనుల కొలనులలో నీరు నిలవనంత సంతోషం.
ఆపరేషన్ గ్లౌజులే వాటర్‌బెడ్...
మొదట్లో పాప అటూ ఇటూ కదిలేది కాదు... మరి ఎటూ కదలకపోతే పుండ్లు పడి పాపకు ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశ ం ఉంది. రోజూ స్పాంజ్ బాత్ చేయించినా పాపకు ఏమయినా అవుతుందా అనే భయం ఉండేది. అందుకే వాటర్‌బెడ్‌లో ఉంచాలనుకున్నాం. కానీ, ఈ వయసు పాపకు వాటర్‌బెడ్‌లుండవు. అందుకే ఆపరేషన్ చేసే గ్లౌజ్‌లలో నీళ్లు పోసి ఆ పాపకు వాటర్‌బెడ్ చేయించాం. ఆ నీళ్లు కదిలినప్పుడల్లా పాప అటూ ఇటూ కదిలేది.
అభిమన్యుడికి పూర్తి వ్యతిరేకం ఈ పాప
వాస్తవానికి ఏ పిల్లలయినా తల్లి గర్భంలో ఉన్నప్పుడే బాహ్య ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటారు. అది కూడా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటేనే జరుగుతుంది. అభిమన్యుడు అలాగే పద్మవ్యూహంలోనికి వెళ్లడం తెలుసుకున్నాడంటారు. కానీ, ఈ పాప అభిమన్యుడికి వ్యతిరేకం. ఆరున్నర నెలలకే బాహ్యప్రపంచంలోనికి రావడంతో పాపకు ఏమీ తెలియడం లేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సమయంలో మా ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఏ.వీ. శ్రీనివాసరావు అమెరికా వెళ్లినప్పుడు తెచ్చిన సౌండ్‌స్పా గుర్తుకు వచ్చింది.
నల్లగొండ ఆసుపత్రిలో రుషితకు చికిత్స అందిస్తున్న డా.యాదయ్య
ఆ పరికరాలను ఉపయోగించి చికిత్స చేయడాన్ని ‘డెవలప్‌మెంటల్ సపోర్టివ్ కేర్’ అంటారు. ఆ పరికరం ద్వారా పాపకు గాలి పీల్చినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది... వర్షం వస్తే ఎలా ఉంటుంది... సెలయేళ్లలో నీరు ఎలా పారుతుంది... సముద్రపు అలల శబ్దం ఎలా ఉంటుంది... రాత్రి పూట ఎలాంటి శబ్దం వ స్తుంది...ఉరుములు, మెరుపులు ఎలా ఉంటాయి..? ఇలా అన్ని రకాల శబ్దాలు వినిపించి ఆమెకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వినికిడి శక్తిని కలిగించాల్సి వచ్చింది.
పిలిస్తే పలికింది...
ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత మాకు ఈ పాపపై పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చింది. 80-90 రోజుల వరకు ఆ పాప మా మాట వినేది కాదు. ఆ తర్వాత మాత్రం పిలిస్తే పలికింది... అమ్మ వచ్చింది అటు చూడు అంటే చూసింది. ఇన్ని రోజులు తిరిగిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆ పాప బరువు 1.60 కిలోలు... ఇంకో విషయమేమిటంటే... పాప పుట్టినప్పుడు 650 గ్రాములుంటే... 15-20 రోజుల తర్వాత 520 గ్రాములకు చేరుకుంది. అక్కడి నుంచి ఇప్పుడు 1.60 కిలోలకు చేరింది. ఇప్పుడు పాప స్వతంత్రంగానే బతకగలదనే నమ్మకం వచ్చింది.పాపను కంటికి రెప్పలా చూసుకున్న ఆసుపత్రి సిబ్బంది
స్పర్శ, వాసన, వినికిడి, రుచి, చూపు అనే ఐదు సెన్స్‌లను ఆమె పసిగడుతోంది. ఈ పాపను ఎంత స్పెషల్‌గా చూశామంటే... ఈమెకు షిఫ్ట్‌కో ప్రత్యేక సిస్టర్. వార్డు మొత్తానికి ఒక సిస్టర్ ఉంటే... ఈమెకు మాత్రమే ఓ సిస్టర్... అది కూడా షిఫ్ట్‌కు ఒకరు, రోజుకు ముగ్గురు.. అలా వైద్యులుగా మేము, ఆసుపత్రి సిబ్బంది, సిస్టర్లు, పరికరాలు, మా విజ్ఞానం, ఆధునిక సౌకర్యాలు, తెలివి, అవకాశాలు, పరిశ్రమ.. అన్నీ కలిపి ఈ పాపను బతికించాయి. ఈ రోజు అంటే శుక్రవారం ఉదయం (ఈనెల 29న) పాపను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నాం. థ్యాంక్స్ టు రుషిత... అన్నారు డాక్టర్ దామెర యాదయ్య ఆనంద బాష్పాలు నిండిన కళ్ళలో.
ప్రీ టెర్మ్ బేబీస్... అపోహలు:
ఇలా నెలలు పూర్తిగా నిండకముందే పుట్టిన పిల్లలు - పూర్తికాలం గర్భంలో ఉన్నవారితో పోలిస్తే కొంత మందకొడిగా ఉంటారనీ, అంతగా చురుగ్గా ఉండరనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఐన్‌స్టీన్, మార్క్‌టై్వన్, విన్‌స్టన్ చర్చిల్, పికాసో... వీళ్లంతా నెలలు నిండకముందే పుట్టారు. వాళ్ల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పాప సైతం ఏ ప్రతిభ చూపనుందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు నల్లగొండ డాక్టర్లు.
- మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, నల్లగొండ.
మన్నించగలరు : ఇవ్వాళ్ల రుషిత డిశ్చార్జ్ చేస్తున్న సందర్భంగా నల్లగొండ ఆసుపత్రి డాక్టర్లు వేడుక చేసుకుంటున్నారు. ఈ మహోన్నతమైన, ఆదర్శవంతమైన కార్యక్రమానికి సలాం చేస్తూ ఇవ్వాళ్ల ఫ్యాషన్ పేజీకి బదులు ఈ కథనం ప్రచురిస్తున్నాం. పాఠకులు దయ ఉంచి మన్నించగలరు. ఈ వేడుకలో పాలుపంచుకోగలరు.