యాదమ్మ (ఫైల్)
నల్లగొండ క్రైం: ఓ కుటుంబంలో ఆస్తి వివాదం చిచ్చుపెట్టింది. తండ్రితో కలిసి ఓ కుమారుడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ (55), ఆమె భర్త గంగయ్య, కుమారుడు యాదగిరి సోమవారం రాత్రి ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో యాదమ్మ ‘అంతా నా ఇష్టం. నా సోదరుడు పొగాకు శ్రీను చెప్పినట్టే చేస్తా’నని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, కుమారుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో గంగయ్య, యాదగిరి కలిసి గొడ్డలితో యాదమ్మ తలపై వేటువేశారు. కొనఊపిరితో ఉన్న ఆమెను బంధువులు రాత్రి 11 గంటల సమయంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది.
వివాదానికి కారణమిదీ...
సుంకరబోయిన గంగయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె కళావతిని యాదమ్మ తన సోదరుడైన అన్నెపర్తికి చెం దిన పొగాకు శ్రీనుకు ఇచ్చి వివాహం చేసింది. కుమారుడు యాదగిరికి వివాహం కాగా, అతని కుటుంబంలో శ్రీను కారణంగా వివాదాలు తలెత్తి భార్యాభర్తలు విడిపోయారు. యాదగిరికి మరోసారి వివాహ ప్రయత్నాలు చేస్తుండగా.. శ్రీను వాటిని చెడగొట్టేవాడు. దీంతోపాటు వ్యవసాయ భూమిలో వాటా కోసం శ్రీను కోర్టులో కేసు వేశాడు. తర్వాత వాటా కు అంగీకారం కుదరడంతో కేసు విరమించుకున్నాడు. నల్లగొండలో ఉన్న ప్లాట్‌ను యాదమ్మ తన పెద్ద కుమార్తె కుటుంబసభ్యులకు ఇచ్చింది. తర్వాత ఆమె భర్త వద్ద ఉండకుండా పెద్ద కుమార్తె అత్తగారితో కలసి ఉంటోంది. కుమారుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడ టం.. సోదరుడివైపే ఒత్తాసు పలుకుతుండటంతో కుటుంబం కలహాలు తలెత్తాయి. ఈక్రమంలో భూమిని అమ్మే విషయమై వివాదం చెలరేగడంతో భర్త, కుమారుడు కలిసి యాదమ్మను చంపేశారు. తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారని చిన్న కుమార్తె రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment