ప్రపంచ నంబర్‌వన్‌పై నెగ్గిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్
స్టావెంజర్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. గతంలో చెస్‌లోని మూడు ఫార్మాట్‌లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్) ఏకకాలంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద సంచలన విజయం నమోదు చేశాడు.
కార్ల్‌సన్ సొంతగడ్డలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నీ పురుషుల విభాగం మూడో రౌండ్‌లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ అద్భుతం చేశాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్‌సన్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చాడు.
గతంలో ఆన్‌లైన్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలో కార్ల్‌సన్‌పై భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్ గెలిచినా... క్లాసికల్ ఫార్మాట్‌లో మాత్రం ప్రజ్ఞానంద తొలిసారి కార్ల్‌సన్‌ను ఓడించాడు. టైమ్ లిమిట్ ఉండని క్లాసికల్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్ ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ అయ్యాక అతడిని ఓడించిన రెండో భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. అంతకుముందు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు.
వైశాలి, హంపి గెలుపు
ఇదే టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. మూడో రౌండ్‌లో వైశాలితోపాటు భారత స్టార్ కోనేరు హంపి కూడా అర్మగెడాన్ గేమ్‌లలో గెలిచారు. క్లాసికల్ ఫార్మాట్‌లో వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 50 ఎత్తుల్లో... హంపి–లె టింగ్లీ (చైనా) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.
విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌లు నిర్వహించగా... హంపి తెల్లపావులతో ఆడి 49 ఎత్తుల్లో లె టింగ్లీపై నెగ్గగా... అనా ముజిచుక్‌తో నల్ల పావులతో ఆడిన వైశాలి 70 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. అర్మగెడాన్ నిబంధనల ప్రకారం నల్లపావులతో ‘డ్రా’ చేసుకున్న ప్లేయర్‌ను విజేతగా ఖరారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment