
బాకు (అజర్‌బైజాన్): ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన సంచలనం సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రదర్శనపై అతని తల్లి నాగలక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. అతని కెరీర్ ఆరంభం నుంచి అన్నింటా తోడుగా ఉంటూ వచ్చిన నాగలక్ష్మి వరల్డ్ కప్‌లోనూ ప్రజ్ఞానంద వెన్నంటే నిలిచింది.
అతను ఫైనల్ చేరడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించడం గొప్పగా అనిపిస్తోందన్న ఆమె... తన కొడుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద ఫైనల్ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. పైగా క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడం దానిని రెట్టింపు చేసింది.
అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. అర్జున్‌తో క్వార్టర్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ప్రజ్ఞ ఏం చేస్తున్నాడనే ఉత్కంఠతోనే అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నాకు తెలియకుండా కొందరు నా ఫోటోలు తీశారు. అవే జనంలోకి వెళ్లాయి. చివరకు ఆ మ్యాచ్‌లో మా అబ్బాయి గెలిచాడు’ అని నాగలక్ష్మి గుర్తు చేసుకుంది.