విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించిన తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్‌లో అధికారికంగా భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్‌గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత కొత్త నంబర్‌వన్‌గా నిలిచాడు.
ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్‌వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు.
భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment