చెస్‌ ఒలింపియాడ్‌–2024.. చెస్‌ ‘క్వీన్స్‌’ | World Junior Championship | Sakshi
Sakshi News home page

చెస్‌ ఒలింపియాడ్‌–2024.. చెస్‌ ‘క్వీన్స్‌’

Published Tue, Sep 24 2024 8:31 AM | Last Updated on Tue, Sep 24 2024 8:31 AM

World Junior Championship

‘చెస్‌ అనేది ఆర్ట్‌. ఆట, సైన్స్‌ల సమాహారం’ అంటారు. ఆ విషయం ఎలా ఉన్నా... చెస్‌ అనేది ఆత్మవిశ్వాస సంకేతం. ఆ ఆత్మవిశ్వాస శక్తితోనే చెస్‌ ఒలింపియాడ్‌–2024(బుడాపెస్ట్, హంగెరి)లో మన మహిళా మణులు సత్తా చాటారు. చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో తొలి స్వర్ణం సాధించారు. మన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి రమేష్‌బాబు, వంతిక ఆగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లు సత్తా చాటారు. స్వర్ణకాంతులతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు..

ఆమె విజయ రహస్యం
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పుట్టింది దివ్యా దేశ్‌ముఖ్‌. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. తండ్రి తరచు చెస్‌బోర్డ్‌ ముందు కూర్చొని కనిపించేవాడు. ఆ దృశ్యాలను పదే పదే చూసిన దివ్యకు చెస్‌పై ఆసక్తి  మొదలైంది. ఆ ఆసక్తి కాస్తా నైపుణ్యంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు.   వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్, ‘వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌’ టైటిల్‌ గెలుచుకుంది.తన ఆట తీరుతో ఎన్నోసార్లు ‘అమేజింగ్‌ పర్‌ఫార్మెన్స్‌’ అనిపించుకున్న దివ్యా దేశ్‌ముఖ్‌  ‘గంటల కొద్దీ ్రపాక్టీస్, తల్లిదండ్రుల నిరంతర ్రపోత్సాహమే నా విజయ రహస్యం’ అంటోంది.

ఆ క్షణం నుంచి...
ఏడున్నర సంవత్సరాల వయసులో తొలిసారిగా చెస్‌ బోర్డ్‌ను టచ్‌ చేసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వంతిక అగర్వాల్‌. ఆ టచ్‌ చేసిన ముహూర్తం ఎలాంటిదోగాని ఆ క్షణం నుంచే చెస్‌ ఆటే తన రూట్‌ అయింది. స్కూల్లో ఫ్రెండ్స్‌తో, ఇంట్లో సోదరుడు విశేష్‌తో చెస్‌ ఆడేది. చెస్‌ కెరీర్‌ ్రపారంభంలోనే ఎన్నో ట్రోఫీలు గెలుచుకొని ‘ఔరా’ అనిపించింది. రోజుకు ఎనిమిది గంటలు చెస్‌ ్రపాక్టీస్‌ చేస్తుంది. పోద్దున యోగా చేయడం, సాయంత్రం బ్యాడ్మింటన్‌ ఆడడం తప్పనిసరి. మొదట్లో గేమ్‌లో ఓటమిని తట్టుకోలేకపోయేది. ఏడ్చేది కూడా. ఏడుస్తూ నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తనలో గెలుపు, ఓటములను సమంగా చూసే పరిణతి వచ్చింది. ‘నేను ఏమాత్రం నిరాశగా  కనిపించినా అమ్మ నాలో ధైర్యం నింపుతుంది. యస్‌...నువ్వు సాధించగలవు అంటుంది. ఆమె నాకు కొండంత అండ’ అంటుంది వంతిక అగర్వాల్‌.

హార్డ్‌ వర్క్‌ ఈజ్‌ ది బిగ్గెస్ట్‌ టాలెంట్‌
2005లో గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించిన తానియా సచ్‌దేవ్‌ దిల్లీలో పుట్టి పెరిగింది. తానియా సచ్‌దేవ్‌కు ఆరేళ్ల వయసులో తల్లి అంజు ద్వారా చెస్‌ పరిచయం అయింది. తానియా తల్లి బ్యాడ్మింటన్, తండ్రి ఫుట్‌బాల్‌ ఆడేవారు. ఈ రెండు ఆటలు కాకుండా తానియాకు చెస్‌ పరిచయం చేయడం యాదృచ్ఛికమే అయినా ఆ చెస్‌ తనని ఎక్కడికో తీసుకెళ్లింది. 2007లో మహిళల ఆసియా చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది తానియ.‘చెస్‌లో స్టార్‌గా రాణించడం ఏ ఒక్కరికో పరిమితమైన ప్రతిభ కాదు. కష్టపడితే అందరికి సాధ్యమే’ అంటున్న తానియా సచ్‌దేవ్‌ గ్యారీ కాస్పరోవ్‌ మాట ‘హార్డ్‌ వర్క్‌ ఈజ్‌ ది బిగ్గెస్ట్‌ టాలెంట్‌’ను పదే పదే గుర్తు తెస్తుంటుంది.

ఆరోజు నుంచి వైశాలి జీవితమే మారిపోయింది!
చెన్నైలో పుట్టింది వైశాలి రమేష్‌బాబు. తల్లి గృహిణి. తండ్రి టీఎన్‌ఎస్‌సీ బ్యాంకులో బ్రాంచ్‌ మేనేజర్‌. ఆమె సోదరుడు ఆర్‌. ప్రజ్ఞానంద గ్రాండ్‌ మాస్టర్‌. చిన్నప్పుడు వైశాలి టీవీకి అతుక్కుపోయేది. చివరికి అదొక వ్యసనంగా మారింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వైశాలిని చెస్‌ క్లాసులకు పంపించారు.


‘నేను వెళ్లను’ అని వైశాలి మారాం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘అలాగే’ అంటూ వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చేసింది. 2012లో గర్ల్స్‌ వరల్డ్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ (అండర్‌–12), 2016లో ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (డబ్ల్యూఐయం) టైటిల్‌ గెలుచుకుంది. చెస్‌లో తొలి పాఠం నుంచి ‘గ్రాండ్‌ మాస్టర్‌’ టైటిల్‌ సొంతం చేసుకోవడం వరకు ఎన్నో విషయాలను నేర్చుకుంది. ఆటకు సంబంధించిన ఇన్‌స్పిరేషన్‌ను ది గ్రేట్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ నుంచి మాత్రమే కాదు తన సోదరుడు ప్రజ్ఞానంద నుంచి కూడా తీసుకుంటుంది. ‘అతడికి ఓపిక ఎక్కువ. గెలుపు, ఓటములను ఒకేరకంగా తీసుకుంటాడు.   ఓర్పు నుంచి స్థితప్రజ్ఞత వరకు ప్రజ్ఞ నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి’ అంటుంది వైశాలి.

కుటుంబ బలం 
పరిచయం అక్కర్లేని పేరు హారిక ద్రోణవల్లి. ఎంతోమంది ఔత్సాహికులకు ఈ గ్రాండ్‌ మాస్టర్‌ స్ఫూర్తిగా మారింది. చెన్నైలో ‘చెస్‌ ఒలింపియాడ్‌’ జరుగుతున్న టైమ్‌లో హారిక తొమ్మిది నెలల గర్భిణి. అయినప్పటికీ పోటీలో పాల్గొని  జట్టుకు కాంస్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని టఫెస్ట్‌ టీమ్‌లు ఏమిటో, ఇండియా టీమ్‌లోని స్ట్రాంగ్‌ పాయింట్స్‌ ఏమిటో హారికకు బాగా తెలుసు. బలాబలాలు బేరీజు వేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు.
‘మనం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంత కాలం చెస్‌ను కొనసాగించవచ్చు. వయసు ముఖ్యం కాదు. నేను బాగా ఆడగలుగుతున్నాను అనిపించినంత కాలం ఆడతాను. కుటుంబ బలం నా అదృష్టం’ అంటోంది హారిక. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement