
కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 1–0 తో మలేసియాపై విజయం సాధించింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా లాల్‌రెమ్‌సియామి చేసిన గోల్‌తో భారత్‌ను విజయం వరించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు భారత్ ఆడిన మూడు గేముల్లో రెండింటిలో గెలిచి మరోటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మలేసియా హోరాహోరీగా పోరాడింది. తొలి నిమిషంలోనే పెనాల్టీకార్నర్‌ను గెలుచుకుంది.
అయితే భారత గోల్‌కీపర్ సవిత చాకచక్యంగా వ్యవహరించడంతో మలేసియాకు గోల్ దక్కలేదు. మరోవైపు భారత్ కూడా తమకు అందివచ్చిన ఐదు పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకుంది. దీంతో తొలి మూడు క్వార్టర్స్ గోల్ లేకుండానే ముగిసిపోయాయి. నాలుగో క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ కోసం దాడులు ఉధృతం చేశాయి. ఆట 55వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ అందించిన పాస్‌ను లాల్‌రెమ్‌సియామి అద్భుతంగా డైవ్ చేస్తూ గోల్‌గా మలిచి భారత శిబిరంలో ఆనందం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment