IND-W Vs AUS-W 2nd T20I: బ్యాటర్ల వైఫల్యంతో...  | IND-W Vs AUS-W 2nd T20I Highlights: Australia Beat India By 6 Wickets To Level Series - Sakshi
Sakshi News home page

IND-W Vs AUS-W 2nd T20I: బ్యాటర్ల వైఫల్యంతో... 

Published Mon, Jan 8 2024 4:24 AM | Last Updated on Mon, Jan 8 2024 9:37 AM

Indian womens team lost in the second T20I - Sakshi

నవీ ముంబై: వరుసగా రెండో విజయంతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాటర్ల వైఫల్యంతో సాధారణ స్కోరుకే పరిమితమైన హర్మన్‌ప్రీత్‌ బృందానికి ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్‌ విజేతను తేల్చే నిర్ణాయక మూడో మ్యాచ్‌ మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

టాపార్డర్‌లో షఫాలీ వర్మ (1), స్మృతి మంధాన (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (13) సహా కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (6) విఫలమయ్యారు. దీంతో 54 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో రిచా ఘోష్‌ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌); దీప్తి శర్మ (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడారు. కానీ రిచా అవుటయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పూజ వస్త్రకర్‌ (9), అమన్‌జోత్‌ కౌర్‌ (4)లు కూడా విఫలమవడంతో డెత్‌ ఓవర్లలో పరుగుల వేగం పుంజుకోలేదు.

ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కిమ్‌ గార్త్‌ (2/27), అనాబెల్‌ సదర్లాండ్‌ (2/18), జార్జియా వేర్‌హమ్‌ (2/17) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు అలీసా హీలీ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు), బెత్‌ మూనీ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి విజయానికి అవసరమైన పునాది వేశారు.

తర్వాత తాలియా మెక్‌గ్రాత్‌ (19; 3 ఫోర్లు), ఎలైస్‌ పెరీ (21 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగైన స్కోరు చేయడంతో ఆ్రస్టేలియా ఒక ఓవర్‌ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్, పూజ చెరో వికెట్‌ పడగొట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement