ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయంపై కన్నేసింది. భారత బౌలర్ల జోరుతో రెండో రోజే మ్యాచ్‌పై జట్టు పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల హవా సాగిన శుక్రవారం రెండు జట్లలో కలిపి 19 వికెట్లు నేలకూలగా... అందులో 15 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. భారత ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ (5/7) కేవలం 7 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీప్తి ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది.
నాట్ సివర్ బ్రంట్ (70 బంతుల్లో 59; 10 ఫోర్లు) మాత్రమే పోరాడి అర్ధ సెంచరీ సాధించగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచే బ్యాటర్లంతా దూకుడుగా ఆడటంతో జట్టు ఆధిక్యం మరింత పెరిగింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (67 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించగా... షఫాలీ వర్మ (33), జెమీమా (27), స్మృతి మంధాన (26) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు చార్లీ డీన్ 4, ఎకెల్‌స్టోన్ 2 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచిన శుభ సతీశ్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో బ్యాటింగ్‌కు దిగలేదు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 410/7తో శుక్రవారం ఉదయం ఆట కొనసాగించిన భారత్ మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఏకంగా 478 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో భారత్ ఇప్పటికే అసాధ్యమైన లక్ష్యం విధించే దిశగా సాగుతోంది. మ్యాచ్‌లో మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే.
Comments
Please login to add a commentAdd a comment