ప్రస్తుతం 36/2
విజయానికి ఇంకా 261 పరుగుల దూరంలో స్టోక్స్ బృందం
మూడో రోజు 16 వికెట్లు
పాకిస్తాన్‌తో రెండో టెస్టు
ముల్తాన్: ఇంగ్లండ్ ముల్తాన్ వేదికపై మరో టెస్టు విజయం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యం ఉంది. రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ ఓ రోజు ముందే దీన్ని ఛేదించే బాధ్యత బ్యాటర్లు తీసుకుంటే ఇంగ్లండ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వశం చేసుకునే స్వర్ణావకాశం జట్టును ఊరిస్తోంది. అయితే మూడో రోజును ఇరుజట్ల బౌలర్లు శాసించారు. దీంతో 16 వికెట్లు కూలాయి. గురువారం ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 239/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ 67.2 ఓవర్లలో 291 పరుగుల వద్ద ఆలౌటైంది.
స్పిన్నర్ సాజిద్ ఖాన్... బ్రైడన్ కార్స్ (4), పాట్స్ (6) బషీర్ (9) వికెట్లను కూడా పడేయడంతో ఈ ఇన్నింగ్స్‌లో అతనికి ఏకంగా 7 వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ బ్యాటర్ స్మిత్ (21; 2 ఫోర్లు), పదో వరుస బ్యాటర్ జాక్ లీచ్ (25 నాటౌట్; 3 ఫోర్లు) ఇరవై పైచిలుకు స్కోరు చేయడంతో ఇంగ్లండ్ క్రితం రోజు స్కోరుకు 52 పరుగులు జత చేసింది. పిచ్ స్వభావాన్ని గుర్తించి ఇంగ్లండ్ కూడా స్పిన్నర్లతో ఆటను ప్రారంభించడంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆలౌటైంది.
టాపార్డర్ బ్యాటర్లు షఫీఖ్ (4), అయూబ్ (22; 1 ఫోర్), షాన్ మసూద్ (11)లకు షోయబ్ బషీర్ స్పిన్ ఉచ్చు బిగించగా, మరో స్పిన్నర్ లీచ్... కమ్రాన్ గులామ్ (26; 5 ఫోర్లు), సౌద్ షకీల్ (31; 2 ఫోర్లు)లను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో పాక్ 114 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఏడో వరుస బ్యాటర్ సల్మాన్ ఆఘా (63; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో పాక్ 200 పైచిలుకు స్కోరు చేయగలిగింది. బషీర్ 4, లీచ్ 3, పేసర్ కార్స్ 2 వికెట్లు తీశారు.
తొలి ఇన్నింగ్స్‌లో పొందిన 75 పరుగుల ఆధిక్యం వల్ల పాక్ ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు క్రాలీ (3), డకెట్ (0) వికెట్లు కోల్పోయి 36/2 స్కోరు చేసింది. ఓలీ పోప్ (21 బ్యాటింగ్, 2 ఫోర్లు), రూట్ (12 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment