క్వార్టర్స్‌లో భారత మహిళలు
* జర్మనీపైనా 5-0తో విజయం
* ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ
కున్‌షాన్ (చైనా): వరుసగా రెండో మ్యాచ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-0తో జర్మనీపై గెలిచింది. ఈ గ్రూప్‌లో రెండేసి విజయాలు సాధించిన భారత్, జపాన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. జపాన్, భారత్ జట్ల మధ్య బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది.
జర్మనీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-15, 21-10తో ఫాబియెన్ డెప్రిజ్‌ను ఓడించి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21-7, 21-12తో లూస్ హీమ్‌పై గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 14-21, 21-9, 21-8తో లిండా ఎఫ్లెర్-లారా కెప్లెన్ జోడీపై నెగ్గడంతో భారత్‌కు 3-0తో విజయం ఖాయమైంది. గద్దె రుత్విక శివాని 21-5, 21-15తో యోన్ లీపై నెగ్గగా... సిక్కి రెడ్డి-సింధు ద్వయం 21-18, 19-21, 22-20తో ఇసాబెల్-ఫ్రాన్‌జిస్కా వోల్క్‌మన్ జంటపై విజయం సాధించడంతో భారత్ ఖాతాలో మరో క్లీన్‌స్వీప్ చేరింది.
పురుషుల జట్టుకు నిరాశ
మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్‌లో 2-3తో హాంకాంగ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 13-21, 12-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ చేతిలో... రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడీ 19-21, 12-21తో చిన్ చుంగ్-తాంగ్ చున్ మాన్ జంట చేతిలో ఓడారు. మూడో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 23-21, 23-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్‌పై సంచలన విజయం సాధించాడు.
నాలుగో మ్యాచ్‌లో సాత్విక్ -చిరాగ్ ద్వయం 10-21, 11-21తో చాన్ కిట్-లా చెక్ హిమ్ జోడీ చేతిలో ఓడటంతో భారత్‌కు 1-3తో ఓటమి ఖాయమైంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 17-21, 21-19, 21-9తో వీ నాన్‌పై గెలిచాడు.