అమ్మాయిలు అజేయంగా | India beat Japan in Asia Champions Trophy Hockey | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అజేయంగా

Published Mon, Nov 18 2024 3:51 AM | Last Updated on Mon, Nov 18 2024 3:51 AM

India beat Japan in Asia Champions Trophy Hockey

3–0తో జపాన్‌పై జయభేరి 

రేపు జపాన్‌తోనే సెమీస్‌ పోరు 

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ 

రాజ్‌గిర్‌ (బీహార్‌): మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ లీగ్‌లో ఎదురు లేని ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–0తో జపాన్‌ పై ఘన విజయం సాధించింది. భారత్‌ తరఫున నవనీత్‌ కౌర్‌ (37వ నిమిషం), దీపిక కుమారి (47వ ని., 48వ ని.) గోల్స్‌ నమోదు చేశారు. ఆడిన మూడూ గెలిచిన భారత్‌ 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలువగా... పారిస్‌ ఒలింపిక్స్‌ రన్నరప్, రజత పతక విజేత చైనా (12) రెండో స్థానంలో నిలిచింది. 

జపాన్‌తో జరిగిన పోరులో తొలి క్వార్టర్‌ నుంచే భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టడంతో మూడు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు లభించాయి. 8వ నిమిషంలో దీపిక తొలి ప్రయత్నాన్ని ప్రత్యర్థి గోల్‌కీపర్‌ యూ కుడో చాకచక్యంగా ఆడ్డుకుంది. మిడ్‌ఫీల్డర్లు కెపె్టన్‌ సలీమా టేటే, నేహా, షరి్మలా దేవిలు రెండో క్వార్టర్‌లో చక్కని సమన్వయంతో ఫార్వర్డ్‌ లైన్‌కు గోల్స్‌ అవకాశాలు సృష్టించారు. కానీ జపాన్‌ రక్షణ పంక్తి అడ్డుకోగలిగింది. దీంతో దీపిక రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. 

ఎట్టకేలకు మూడో క్వార్టర్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. వైస్‌కెపె్టన్‌ నవ్‌నీత్‌ కౌర్‌ రివర్స్‌ షాట్‌ కొట్టి ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి క్వార్టర్‌ మొదలవగానే దీపిక చెలరేగింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించుకొని గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ క్రమంలో వరుస పెనాల్టీ కార్నర్లను దీపిక గోల్స్‌గా మలిచి భారత్‌ను గెలిచే స్థితిలో నిలిపింది. 

చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్‌ ప్రత్యరి్థకి  మాత్రం ఒక్క గోల్‌ కొట్టకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది.  చాంపియన్స్‌ ట్రోఫీలో దీపిక దూకుడుకు ప్రత్యర్థి డిఫెండర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ టోర్నీలోనే ఆమెది అసాధారణ ప్రదర్శన. నాకౌట్‌కు ముందే ఆమె పది గోల్స్‌ సాధించింది. ఇందులో 4 ఫీల్డ్‌ గోల్స్‌ కాగా, ఐదు పెనాల్టీ కార్నర్‌ గోల్స్‌ ఉన్నాయి. 

మరొకటి పెనాల్టీ స్ట్రోక్‌తో చేసింది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 2–0తో థాయ్‌లాండ్‌పై, చైనా 1–0తో దక్షిణ కొరియాపై గెలుపొందాయి. భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి కూడా జపానే! మంగళవారం జరిగే సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు... నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌తో తలపడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement