Uber Cup badminton tournament
-
ఇంకేం చేస్తాం... వాయిదా వేస్తాం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ భయానికి ఒక్కో జట్టు తప్పుకుంటోంది. ‘మేం ఆడమంటే ఆడబోమని’ చెప్పే దేశాల సంఖ్య చాంతాడంత కావడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) చేసేదేమీ లేక... చేతులెత్తేసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. దీని కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) పురుషులు, మహిళల జట్లను కూడా ఎంపిక చేసింది. మరోవైపు మాత్రం ఒక్కో దేశం టోర్నీ నుంచి తప్పుకుం టోంది. థాయ్‌లాండ్, ఆ్రస్టేలియా, చైనీస్ తైపీ, అల్జీరియా, 16 సార్లు చాంపియన్ ఇండోనేసియా, దక్షిణకొరియా ఆడబోమని చెప్పేశాయి. ఇలా మేటి జట్లన్నీ తప్పుకుంటే ప్రతిష్టాత్మక టోర్నీ ప్రభ కోల్పోతుందని భావించిన బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌నే వాయిదా వేసింది. ‘ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆతిథ్య దేశంతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన మీదట టోర్నీని వాయిదా వేసింది. ఈ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తాం’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి ఈ టోర్నీని ఎలాగొలా నిర్వహించాలనే బీడబ్ల్యూఎఫ్ ప్రయత్నించింది. ప్రత్యామ్నాయ వేదికగా సింగపూర్, హాంకాంగ్‌లను పరీశిలించింది. కానీ ఆ రెండు దేశాలు నిర్వహణకు అంగీకరించలేదు. దీంతో పాటు జపాన్, చైనాలు కూడా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో బీడబ్ల్యూఎఫ్ ఈ మెగా ఈవెంట్ వాయిదాకే మొగ్గు చూపింది. -
ఉబెర్ కప్‌లో ఆడేందుకు సింధు అంగీకారం: ‘బాయ్’ చీఫ్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వచ్చే నెలలో జరిగే థామస్ కప్–ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నీలో దిగనుంది. నిజానికి వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. తన కుటుంబసభ్యులకు చెందిన వేడుక కోసం ఈ టోర్నీలో ఆడనని చెప్పింది. అయితే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చీఫ్ హిమంత బిశ్వ శర్మ ఆమెను ఆడేందుకు ఒప్పించినట్లు తెలిసింది. ‘ఆ టోర్నీలో భారత్‌కు సానుకూలమైన ‘డ్రా’ ఉండటంతో ఆడాల్సిందిగా సింధును కోరాను. ఆమె జట్టుతో కలిసి ఆడితే భారత్‌కు పతకం అవకాశాలుంటాయని చెప్పాను. దీంతో ఆమె బరిలోకి దిగేందుకు సమ్మతించింది’ అని హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. సింధు తన కుటుంబానికి చెందిన వేడుకను టోర్నీ ప్రారంభానికంటే ముందుగా నిర్వహించుకుంటానని తనతో చెప్పినట్లు ఆయన వివరించారు. డెన్మార్క్‌లో వచ్చేనెల 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ‘బాయ్’ ఈ టీమ్ ఈవెంట్ కోసం 26 మంది షట్లర్లకు హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో శిబిరం నిర్వహిస్తోంది. 17న తుది జట్లను ఎంపిక చేస్తారు. -
థామస్ కప్–ఉబెర్ కప్ టోర్నీ మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ డెన్మార్క్ వేదికగా మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయి తే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నీని వాయిదా వేసి... ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడం... ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమిగూడవద్దని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి. -
మరోసారీ కాంస్యమే...
► సెమీస్‌లో 0-3తో చైనా చేతిలో ఓడిన భారత మహిళల జట్టు ► ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ... కున్షాన్ (చైనా): అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు తడబాటుతో... వరుసగా రెండోసారి భారత మహిళల జట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ ఉబెర్ కప్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 0-3 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్... రెండో మ్యాచ్‌లో పీవీ సింధు... మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-సిక్కి రెడ్డి పరాజయం పాలయ్యారు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. 2014 ఉబెర్ కప్‌లోనూ భారత్ సెమీస్‌లో ఓడి తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సైనా తీవ్రంగా పోరాడినా ఓటమి తప్పలేదు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 15-21, 21-12, 17-21తో ఓడిపోయింది. లీ జురుయ్ చేతిలో సైనాకిది వరుసగా ఎనిమిదో పరాజయం, ఓవరాల్‌గా 12వ ఓటమి. చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌పై సైనా గెలుపొందడం గమనార్హం. ప్రపంచ ఆరో ర్యాంకర్ షిజియాన్ వాంగ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు 13-21, 21-23తో పరాజయాన్ని చవిచూసింది. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండో గేమ్‌లో 18-8తో పది పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అయితే కీలక దశలో ఒత్తిడికి గురైన సింధు అనవసర తప్పిదాలు చేసి షిజియాన్‌కు పుంజుకునే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత సింధుకు నాలుగుసార్లు గేమ్ పాయింట్లు లభించినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. షిజియాన్ చేతిలో సింధుకిది వరుసగా నాలుగో ఓటమికాగా ఓవరాల్‌గా ఆరోది. మూడో మ్యాచ్‌లో జ్వాల-సిక్కి రెడ్డి జంట 6-21, 6-21తో తియాన్ కింగ్-జావో యున్లీ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది. -
క్వార్టర్స్‌లో భారత మహిళలు
* జర్మనీపైనా 5-0తో విజయం * ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కున్షాన్ (చైనా): వరుసగా రెండో మ్యాచ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-0తో జర్మనీపై గెలిచింది. ఈ గ్రూప్‌లో రెండేసి విజయాలు సాధించిన భారత్, జపాన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. జపాన్, భారత్ జట్ల మధ్య బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. జర్మనీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-15, 21-10తో ఫాబియెన్ డెప్రిజ్ను ఓడించి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21-7, 21-12తో లూస్ హీమ్పై గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 14-21, 21-9, 21-8తో లిండా ఎఫ్లెర్-లారా కెప్లెన్ జోడీపై నెగ్గడంతో భారత్‌కు 3-0తో విజయం ఖాయమైంది. గద్దె రుత్విక శివాని 21-5, 21-15తో యోన్ లీపై నెగ్గగా... సిక్కి రెడ్డి-సింధు ద్వయం 21-18, 19-21, 22-20తో ఇసాబెల్-ఫ్రాన్జిస్కా వోల్క్మన్ జంటపై విజయం సాధించడంతో భారత్ ఖాతాలో మరో క్లీన్‌స్వీప్ చేరింది. పురుషుల జట్టుకు నిరాశ మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్‌లో 2-3తో హాంకాంగ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 13-21, 12-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ చేతిలో... రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడీ 19-21, 12-21తో చిన్ చుంగ్-తాంగ్ చున్ మాన్ జంట చేతిలో ఓడారు. మూడో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 23-21, 23-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్‌పై సంచలన విజయం సాధించాడు. నాలుగో మ్యాచ్‌లో సాత్విక్ -చిరాగ్ ద్వయం 10-21, 11-21తో చాన్ కిట్-లా చెక్ హిమ్ జోడీ చేతిలో ఓడటంతో భారత్‌కు 1-3తో ఓటమి ఖాయమైంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 17-21, 21-19, 21-9తో వీ నాన్పై గెలిచాడు.