మరోసారీ కాంస్యమే...
► సెమీస్‌లో 0-3తో చైనా చేతిలో ఓడిన భారత మహిళల జట్టు
► ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ...
కున్‌షాన్ (చైనా): అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు తడబాటుతో... వరుసగా రెండోసారి భారత మహిళల జట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ ఉబెర్ కప్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 0-3 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్... రెండో మ్యాచ్‌లో పీవీ సింధు... మూడో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-సిక్కి రెడ్డి పరాజయం పాలయ్యారు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. 2014 ఉబెర్ కప్‌లోనూ భారత్ సెమీస్‌లో ఓడి తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది.
ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సైనా తీవ్రంగా పోరాడినా ఓటమి తప్పలేదు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 15-21, 21-12, 17-21తో ఓడిపోయింది. లీ జురుయ్ చేతిలో సైనాకిది వరుసగా ఎనిమిదో పరాజయం, ఓవరాల్‌గా 12వ ఓటమి. చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌పై సైనా గెలుపొందడం గమనార్హం. ప్రపంచ ఆరో ర్యాంకర్ షిజియాన్ వాంగ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు 13-21, 21-23తో పరాజయాన్ని చవిచూసింది. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండో గేమ్‌లో 18-8తో పది పాయింట్ల ఆధిక్యంలో ఉంది.
అయితే కీలక దశలో ఒత్తిడికి గురైన సింధు అనవసర తప్పిదాలు చేసి షిజియాన్‌కు పుంజుకునే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత సింధుకు నాలుగుసార్లు గేమ్ పాయింట్లు లభించినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. షిజియాన్ చేతిలో సింధుకిది వరుసగా నాలుగో ఓటమికాగా ఓవరాల్‌గా ఆరోది. మూడో మ్యాచ్‌లో జ్వాల-సిక్కి రెడ్డి జంట 6-21, 6-21తో తియాన్ కింగ్-జావో యున్‌లీ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది.