హర్మన్‌ప్రీత్ బృందం సెమీస్ ఆశలు గల్లంతు
చివరి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన కివీస్
54 పరుగులతో ఘన విజయం
మహిళల టి20 వరల్డ్ కప్
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది.
గెలిపించిన బౌలర్లు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది.
అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment