నేడు ప్రపంచ కప్‌లో భారత మహిళల కీలక మ్యాచ్
ఆసియా చాంపియన్ శ్రీలంకతో హర్మన్ బృందం పోరు
రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: అంతర్జాతీయ మహిళల టి20ల్లో శ్రీలంకపై భారత విజయాల రికార్డు 19–5తో ఎంతో ఘనంగా ఉంది. అయితే ఈ ఐదు పరాజయాల్లో చివరిది ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో వచ్చి0ది. అప్పటి వరకు అద్భుత ఫామ్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులో అనూహ్యంగా పరాజయం పాలైంది.
కాబట్టి శ్రీలంకే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ వరల్డ్ కప్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలవడంతో పాటు రన్‌రేట్ మెరుగుపర్చుకోవడం కూడా భారత్‌కు ముఖ్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి.
టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు శ్రీలంక వరుసగా పాకిస్తాన్, ఆ్రస్టేలియాల చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో ఓడితే లంక నిష్క్రమణ ఖాయమవుతుంది.
హర్మన్ సిద్ధం...
కివీస్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–5 స్మృతి, షఫాలీ, హర్మన్, జెమీమా, రిచా విఫలం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. దాని నుంచి కోలుకొని పాక్‌ను ఓడించినా... ఇక్కడా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. బౌలర్ల ప్రదర్శనతో పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా జట్టు 18.5 ఓవర్లు తీసుకోవడంతో రన్‌రేట్ కూడా పెంచుకునే అవకాశం లేకపోయింది.
ఇలాంటి స్థితిలో లంకపై బ్యాటర్లు చెలరేగి భారీ స్కోరు సాధిస్తేనే జట్టుకు మేలు కలుగుతుంది. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన స్మృతికి లంకపై కూడా పేలవ రికార్డు ఉంది. మెడ నొప్పితో పాక్‌తో మ్యాచ్‌లో చివరి క్షణాల్లో నిష్క్రమించిన కెపె్టన్ హర్మన్ కోలుకొని ఈ పోరుకు అందుబాటులోకి రావడం టీమ్‌కు సానుకూలాంశం.
షఫాలీ దూకుడుగా ఆడి శుభారంభం అందిస్తే మిగతా బ్యాటర్లు దానిని కొనసాగించగలరు. పాక్‌తో ఆడిన టీమ్‌నే ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. పేసర్ పూజ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్ సజనకు చోటు ఖాయం.
అటపట్టు ఆడితేనే...
వరుసగా రెండు ఓటముల తర్వాత శ్రీలంక పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న కెపె్టన్, స్టార్ ప్లేయర్ చమరి అటపట్టు రెండు మ్యాచ్‌లలోనూ ఓపెనర్‌గా విఫలం కావడంతో దాని ప్రభావం టీమ్‌పై కూడా పడింది. ఆ్రస్టేలియాతో పోరులో 93 పరుగులకే పరిమితం అయిన లంక... అంతకుముందు తమకంటే బలహీన జట్టు అయిన పాకిస్తాన్‌తో కూడా పేలవంగా ఆడి 85 పరుగులే చేయగలిగింది.
రెండు మ్యాచ్‌లలో కూడా ఒక్క బ్యాటర్ కనీసం 30 పరుగుల స్కోరు చేయలేదు. బౌలింగ్‌లో అనుభవరాహిత్యం కూడా లంకను బలహీనంగా మార్చింది. ఇలాంటి టీమ్ భారత్‌కు పోటీనివ్వగలదా లేక ఆసియా కప్ ఫైనల్ స్ఫూర్తితో మళ్లీ ఇబ్బంది పెట్టగలదా అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment