
భారత మహిళల, పురుషుల బ్యాడ్మింటన్ జట్లు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి పతకం రేసు నుంచి నిష్క్రమించాయి. భారత మహిళల జట్టు 1–3తో పటిష్టమైన జపాన్ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో సింధు 21–18, 21–19తో రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై నెగ్గి 1–0 ఆధిక్యం అందించింది. డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ఆర్తి సునిల్ జంట 15–21, 6–21తో యూకి ఫుకుషిమా–సయాకా జోడీ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో సైనా 11–21, 25–23, 16–21తో ఒకుహారా చేతిలో ఓడింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో సింధు–అశ్విని ద్వయం 13–21, 12–21తో అయాక తకహషి–మిసాకి జంట చేతిలో ఓడటంతో భారత పోరాటం ముగిసింది.
ఇక భారత పురుషుల జట్టు 1–3తో ఇండోనేసియా చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–23, 22–20, 10–21తో గిన్‌టింగ్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్æ–చిరాగ్‌శెట్టి జోడీ 21–19, 19–21, 16–21తో సుకాముల్జో–ఫెర్నాల్డీ గిడియోన్ చేతిలో ఓడింది. భారత్ 0–2తో వెనుకబడిన స్థితిలో సింగిల్స్ బరిలో దిగిన ప్రణయ్ 21–15, 19–21, 21–19తో జొనాథన్ క్రిస్టీపై గెలిచి పోటీలో నిలిపినా... మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 14–21, 18–21తో ఫజర్–రియాన్ జోడీ చేతిలో ఓడింది.
కబడ్డీలో షాక్...
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల కబడ్డీ జట్టుకు షాక్ తగిలింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం భారత్ 23–24తో కొరియా చేతిలో ఖంగుతింది. ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశ పెట్టిన 28 ఏళ్లలో భారత జట్టు ఓ మ్యాచ్‌లో ఓడటం ఇదే తొలి సారి. మహిళల జట్టు 33–23తో థాయ్‌లాండ్‌పై గెలిచింది.
సెపక్‌తక్రాలో పతకం ఖాయం...
సెపక్‌తక్రాలో భారత్‌కు తొలిసారి పతకం ఖాయమైంది. పురుషుల టీమ్ రెగూ ప్రిలిమినరీ విభాగంలో భారత్ 21–16, 19–21, 21–17తో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది.
ప్రాంజల జంట ఓటమి
మహిళల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల–రుతుజా భోస్లే జంట 6–3, 4–6, 9–11తో నిచా–ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్; రామ్‌కుమార్... మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా, కర్మన్ కౌర్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు.
భారత్ 17 – ఇండోనేసియా 0
భారత పురుషుల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో 17–0తో ఆతిథ్య ఇండోనేసియాను చిత్తుచేసింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్, సిమ్రన్‌జీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ మూడేసి గోల్స్ చేయగా...రూపిందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సునీల్, వివేక్ సాగర్ ఒక్కో గోల్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment