నాలుగు నెలల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌ల పర్యటనలో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాపై భారత జట్టు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. భారత్ కోణంలో చూస్తే పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో యువ క్రీడాకారిణులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది.
కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నిలిచింది. సీనియర్ స్పిన్నర్లు రాధ యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్ లేకపోవడంతో తన ప్రతిభను ప్రదర్శించేందుకు అనూషకు ఇది మంచి చాన్స్. ఆమె తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు.
రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి ఎంపికైన పేసర్ మోనికా పటేల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. భారత మహిళల జట్టు కోచ్‌గా అమోల్ మజుందార్ ఎంపిక దాదాపు ఖాయమైనా...అధికారిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అతను కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్–19 జట్టు, ఇటీవల ఆసియా కప్ గెలిచిన అండర్–23 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది.
తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, బారెడ్డి అనూష
Comments
Please login to add a commentAdd a comment