మిథాలీ సేనపై ప్రశంసల ట్వీట్లు..
డెర్బీ: చావో రేవో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన కీలకపోరులో మిథాలీ సేన 186 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మిథాలీ అజెయ శతకం, వేద మెరుపు ఇన్నింగ్స్, గైక్వాడ్ స్పిన్ బౌలింగ్ ప్రదర్శనలపై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల ట్వీట్లతో ముంచెత్తారు.
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ మిథాలీ రాజ్, వేద, రాజేశ్వరిలది గొప్ప ప్రదర్శనంటూ భారత మహిళలకు అభినందనలు తెలిపాడు. మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మహిళల బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేయగా గౌతమ్ గంభీర్ ఆల్‌దిబెస్ట్, మీ అందరికి మా మద్దతు ఉంటుందని ట్వీట్ చేశాడు. ఇక భారత స్పిన్నర్ అశ్విన్ కివీస్‌ను క్లినికల్ ప్రదర్శనతో ఓడించారని పొగడాడు. భారత మహిళల ప్రదర్శన అద్భుతమని మనోజ్ తివారి ప్రశంసించాడు.
సమిష్టీ ప్రదర్శనతో సెమీస్‌కు చేరడం గర్వంగా ఉందని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. ఇక హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ భారత స్పిన్‌కు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పుకూలింది. గైక్వాడ్ ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. మాజీ క్రికెటర్లు హర్భజన్, ఆకాశ్ చోప్రాలు సైతం భారత మహిళలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.