
ముంబై: ఎట్టకేలకు ఇంగ్లండ్ గెలిచింది. 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 49 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి.. ఇక క్లీన్‌స్వీపే అనిపించిన దశలో ప్రపంచ చాంపియన్ కడదాకా పోరాడింది. గెలిచే దాకా పట్టుదల చూపింది. చివరకు భారత మహిళల నుంచి వైట్‌వాష్‌ను తప్పించుకుంది. గురువారం జరిగిన చివరి మూడో వన్డేలో భారత మహిళల జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఆధిక్యం 2–1కు పరిమితమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 50 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (74 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా... పూనమ్ రౌత్ (97 బంతుల్లో 56; 7 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ కాగా... స్మృతి, పూనమ్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. కానీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కాథరీన్ బ్రంట్ (5/28) దెబ్బకు భారత్ తడబడింది. 150 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. చివరకు దీప్తిశర్మ 27, శిఖాపాండే 26 పరుగులు చేయడంతో 200 దాటింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలో ఇంగ్లండ్‌పై జులన్ గోస్వామి (3/41) పంజా విసిరింది. దీంతో 49 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హీథర్ నైట్ (63 బంతుల్లో 47; 6 ఫోర్లు), ఆల్‌రౌండర్ వ్యాట్ (82 బంతుల్లో 56; 5 ఫోర్లు), ఎల్విస్ (53 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు) పట్టుదలతో ఆడి జట్టును గెలిపించారు. శిఖా పాండే, పూనమ్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఈ నెల 4, 7, 9 తేదీల్లో గువహటిలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment