
బెల్జియం అబ్బాయిలు... భారత అమ్మాయిలు
హాకీ ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’
ఆంట్‌వర్ప్ (బెల్జియం): మహిళల జట్టు ప్రత్యర్థిగా మరో మహిళల జట్టు ఉండటం సహజం. కానీ తమ యూరోప్ పర్యటనలో భారత మహిళల జట్టు ప్రాక్టీస్ కోసం కొత్తగా ఆలోచించింది. మహిళల జట్టుతో కాకుండా బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో ఆడాలని నిర్ణయించుకుంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2–2తో బెల్జియం జూనియర్ పురుషుల జట్టును నిలువరించడం విశేషం.
భారత్ నుంచి నిక్కీ ప్రధాన్ (36వ నిమిషంలో), వందన (54వ నిమిషంలో) గోల్స్ సాధించారు. ఆట 40వ సెకనులోనే కెప్టెన్ రాణికి పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కినా గోల్‌గా మలచలేకపోయింది. అటు ప్రత్యర్థికి ఆరు నిమిషాల వ్యవధిలోనే మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించినా గోల్‌కీపర్ సవిత అద్భుతంగా అడ్డుకుంది. ఆ తర్వాత 1–2తో వెనకబడిన దశలో భారత్‌ను చివర్లో వందన ఆదుకోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది.