గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో ఆ్రస్టేలియా 37 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సారథి తహిలా మెక్‌గ్రాత్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో స్యామి జో జాన్సన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది.
భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (2/22) రాణించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి ఓడిపోయింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (1) విఫలమైంది. వేద కృష్ణమూర్తి (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చివర్లో అరుంధతి రెడ్డి (14 బంతుల్లో 19; 1 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ స్కోరు 100 పరుగులు దాటగలిగింది. తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడగా... నామమాత్రపు మూడో టి20 ఈనెల 23వ తేది జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment