సిరీస్‌పై భారత మహిళల గురి | Today second ODI match of Indian womens team against New Zealand | Sakshi
Sakshi News home page

IND-w vs NZ-w: సిరీస్‌పై భారత మహిళల గురి

Published Sun, Oct 27 2024 4:17 AM | Last Updated on Sun, Oct 27 2024 9:13 AM

Today second ODI match of Indian womens team against New Zealand

నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డే మ్యాచ్‌ 

గాయంతో అమెలియా అవుట్‌ 

మ.గం.1:30 నుంచి స్పోర్ట్స్‌18, జియో సినిమాలో ప్రసారం 

అహ్మదాబాద్‌: భారత మహిళల జట్టు సిరీస్‌ లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ను కంగు తినిపించిన భారత్‌ ఇప్పుడు వరుస విజయంపై కన్నేసింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు కివీస్‌ ఈ మ్యాచ్‌లో పుంజుకొని సిరీస్‌ రేసులో నిలవాలని ఆశిస్తోంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఉన్న కివీస్‌ ఏమేరకు రాణిస్తుందో చూడాలి.  

స్మృతి రాణిస్తేనే... 
గత మ్యాచ్‌లో రెగ్యులర్‌ కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో దూరం కావడంతో సారథ్యం వహించిన స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఫామ్‌ జట్టును కలవరపెడుతోంది. ఇటీవలి టి20 ప్రపంచకప్‌ సహా వరుసగా విఫలమవడం బ్యాటింగ్‌ విభాగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. టాపార్డర్‌లో షఫాలీ, యస్తిక భాటియా మెరుగ్గా ఆడటం, జెమీమా, దీప్తిశర్మ తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తేజల్‌ హసబి్నస్‌ మిడిలార్డర్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడటంతో హర్మన్‌ జట్టులోకి వచ్చినా ఆమె స్థానానికి ఢోకాలేదు. 

కివీస్‌కు మరో దెబ్బ 
సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌కు అమెలియా కెర్‌ గాయం మరో దెబ్బకొట్టింది. తొలి వన్డే సందర్భంగా ఆమె తొడకండరాల గాయానికి గురైంది. దీంతో మిగతా మ్యాచ్‌లకు దూరమైన ఆమె స్వదేశానికి పయనమైంది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడం జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోఫీ డివైన్‌ సేన సమష్టిగా ఆడితేనే గెలిచి సిరీస్‌లో నిలుస్తుంది. లేదంటే సిరీస్‌ కోల్పోయే పరిస్థితి వస్తుంది. 

జట్లు (అంచనా) 
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, యస్తిక, జెమిమా, తేజల్‌ హసబ్నిస్, దీప్తిశర్మ, అరుంధతీ, రాధా యాదవ్, సయిమా, రేణుకా సింగ్‌.   
న్యూజిలాండ్‌: సోఫీ డివైన్‌ (కెప్టెన్), సుజీబేట్స్, జార్జియా, బ్రూక్‌ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ల గేజ్, జెస్‌ కెర్, మోలి ఫెన్‌ఫోల్డ్, ఎడెన్‌ కార్సన్, లీ తహుహు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement