Women's T20 World Cup: ICC Women's T20 World Cup Group B Match Between India And West Indies - Sakshi
Sakshi News home page

Womens T20 World Cup: మరో విజయమే లక్ష్యంగా...

Published Wed, Feb 15 2023 5:36 AM | Last Updated on Wed, Feb 15 2023 10:30 AM

Womens T20 World Cup: ICC Womens T20 World Cup Group B match between India and West Indies - Sakshi

కేప్‌టౌన్‌: టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు వరుసగా మరో విజయంపై దృష్టి సారించింది. బుధవారం గ్రూప్‌ ‘బి’లో జరిగే లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన... వెస్టిండీస్‌తో తలపడుతుంది. మరోవైపు ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన కరీబియన్‌ అమ్మాయిలు బోణీ కొట్టేందుకు చూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్‌ ఎదురైన గత మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభంలో తడబడినా... తర్వాత పుంజుకుంది.

డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన గాయంతో అందుబాటులో లేకపోయినా... లక్ష్యఛేదనలో భారత్‌ ఆడిన తీరు బాగుంది. ఇప్పుడైతే స్టార్‌ ఓపెనర్‌ స్మృతి తుది జట్టులోకి రావడంతో బ్యాటింగ్‌ దళం మరింత పటిష్టమైంది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్‌ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌ తన పదును చూపాల్సి ఉంది.

పాక్‌తో పోరులో తొలి పది ఓవర్ల పాటు బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. కానీ తర్వాతి 10 ఓవర్లే కట్టుదిట్టంగా వేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అలాంటి తడబాటుకు అవకాశమివ్వకుండా రాణిస్తే భారత్‌కు వరుస విజయం కష్టమేం కాదు. మరోవైపు విండీస్‌ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. వరుసగా 14 మ్యాచ్‌ల్లో హేలీ మాథ్యూస్‌ సేన గెలుపొందలేకపోయింది. ఇందులో ఒక మ్యాచ్‌ ‘టై’కాగా... 13 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం జట్టును కుంగదీస్తోంది. మెగా ఈవెంట్‌లో\ ముందంజ వేయాలంటే కరీబియన్‌ జట్టుకు ప్రతీ మ్యాచ్‌ కీలకంగా మారింది. తొలి లీగ్‌ మ్యాచ్‌లో విండీస్‌ ఏడు వికెట్లతో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది.

12:ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్‌ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్‌ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement