టి20 సిరీస్‌ కూడా మనదే  | Indian womens cricket team seal series against Sri Lanka | Sakshi
Sakshi News home page

టి20 సిరీస్‌ కూడా మనదే 

Published Tue, Sep 25 2018 12:37 AM | Last Updated on Tue, Sep 25 2018 12:37 AM

Indian womens cricket team seal series against Sri Lanka  - Sakshi

కొలంబో: వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు అదే జోరును టి20 సిరీస్‌లోనూ కొనసాగించింది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. అనూజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. చివరిదైన ఐదో మ్యాచ్‌ నేడు జరుగుతుంది. రెండో  మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. 

టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 134 పరుగులు సాధించింది. సిరివర్ధనే (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్స్‌), జయాంగని (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో అనూజా పాటిల్‌ 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకుంది. అనంతరం భారత్‌ 15.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్‌ (7 బంతుల్లో 11; 2 ఫోర్లు), స్మృతి మంధాన (5), తానియా భాటియా (5) తొందరగా ఔటవ్వడంతో ఒకదశలో భారత్‌ 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనూజా పాటిల్‌ (42 బంతుల్లో 54 నాటౌట్‌; 7 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడారు. లంక బౌలర్ల పనిపట్టి నాలుగో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశారు. ఈ సిరీస్‌లో జెమీమాకిది రెండో అర్ధసెంచరీ. మూడో మ్యాచ్‌లో జెమీమా 57 పరుగులు సాధించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement