సూపర్‌ సెంచరీ: శ్రీలంకపై ఐర్లాండ్‌ తొలి గెలుపు | Gaby Lewis Century Leads Ireland First Ever Win Over Sri Lanka | Sakshi
Sakshi News home page

సూపర్‌ సెంచరీ: శ్రీలంకపై ఐర్లాండ్‌ తొలి గెలుపు

Aug 14 2024 11:33 AM | Updated on Aug 14 2024 11:51 AM

Gaby Lewis Century Leads Ireland First Ever Win Over Sri Lanka

ఐర్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారి శ్రీలంక జట్టుపై గెలుపు నమోదు చేసింది. ఓపెనర్‌ గాబీ లూయిస్‌ అద్భుత శతకంతో ఇది సాధ్యమైంది. కాగా రెండు టీ20, ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు శ్రీలంక మహిళా జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది.

17 ఫోర్లు, 2 సిక్సర్లు
ఇరు జట్ల మధ్య ఆదివారం నాటి (ఆగష్టు 11) తొలి టీ20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలవగా.. మంగళవారం రాత్రి నాటి రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను అనూహ్య రీతిలో విజయం వరించింది. డబ్లిన్‌ వేదికగా జరిగిన ఈ టీ20లో టాస్‌ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ ఆమీ హంటర్‌ 9 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్‌ గాబీ లూయిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగింది.

 

ఏకంగా 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 బంతుల్లోనే 119 పరుగులతో సత్తా చాటింది. గాబీకి తోడుగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓర్లా ప్రెండ్రెర్‌గాస్ట్‌(38) రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి ఐరిష్‌ జట్టు 173 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే తమ ఓపెనర్‌ విష్మి గుణరత్నె(1) వికెట్‌ కోల్పోయింది.

రాణించిన హర్షిత, కవిశా.. కానీ ఓటమి తప్పలేదు
అయితే, మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ హర్షిత సమరవిక్రమ 65 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. నాలుగో స్థానంలో వచ్చిన కవిశా దిల్హారీ 51 పరుగులతో అజేయంగా నిలవగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగిన శ్రీలంక ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.

ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌ మహిళా జట్టుకు శ్రీలంకపై తొలి అంతర్జాతీయ విజయం దక్కింది. ఐరిష్‌ బౌలర్లలో ఫ్రెయా సార్గెంట్‌, ఓర్లా ప్రెండ్రెర్‌గాస్ట్‌ రెండేసి వికెట్లు తీయగా.. జానే మాగ్విరే, అవా కానింగ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక రెండో టీ20లో విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఐర్లాండ్‌. గాబీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి వన్డే సిరీస్‌ మొదలుకానుంది.

 

చదవండి: The Hundred 2024: కళ్లుచెదిరే క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే(వీడియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement