టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు | Babar Azam Scripts History In T20s But Pakistan Falter Vs Ireland in 1st T20I | Sakshi
Sakshi News home page

టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు

Published Sat, May 11 2024 11:20 AM | Last Updated on Sat, May 11 2024 12:40 PM

Babar Azam Scripts History In T20s But Pakistan Falter Vs Ireland in 1st T20I

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా  మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. 

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్‌ జరిగింది. డబ్లిన్‌లో జరిగిన ఈ టీ20లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్‌ సయీం ఆయుబ్‌(29 బంతుల్లో 45)తో పాటు బాబర్‌ ఆజం(43 బంతుల్లో 57), ఇఫ్తికర్‌ అహ్మద్‌(15 బంతుల్లో 37*) రాణించారు.

ఒక బంతి మిగిలి ఉండగానే
అయితే, పాక్‌ విధించిన లక్ష్యాన్ని ఐర్లాండ్‌ అనూహ్య రీతిలో ఛేదించింది. ఓపెనర్‌ ఆండ్రు బల్బిర్నీ(55 బంతుల్లో 77), హ్యారీ టెక్టర్‌(27 బంతుల్లో 36), జార్జ్‌ డాక్రెల్‌(12 బంతుల్లో 24) దుమ్ములేపడంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయ ఢంకా మోగించింది.

ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసి సొంతగడ్డపై జయభేరి మోగించింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది ఐర్లాండ్‌. దీంతో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైనా.. బాబర్‌ ఆజం మాత్రం వ్యక్తిగతంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు.

పిన్న వయస్కుడిగా బాబర్‌ ప్రపంచ రికార్డు
పొట్టి ఫార్మాల్లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా 29 ఏళ్ల బాబర్‌ ఆజం నిలిచాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్‌ గేల్‌, విరాట్‌ కోహ్లి బాబర్‌ కంటే ముందున్నారు.

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో బాబర్‌ ఆజం 50కి పైగా పరుగులు సాధించడం ఇది 38వసారి. తద్వారా విరాట్‌ కోహ్లి రికార్డును అతడు సమం చేశాడు.

టీ20లలో వందకు పైగా 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన టాప్‌-5 ఆటగాళ్లు
👉1. డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 377 మ్యాచ్‌లలో- 12,232 పరుగులు- 110(8 సెంచరీలు, 102 అర్ధ శతకాలు)
👉2. క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌)- 463 మ్యాచ్‌లలో- 14,562 పరుగులు- 110(22 సెంచరీలు, 88 అర్ధ శతకాలు)
👉3.విరాట్‌ కోహ్లి(ఇండియా)- 388 మ్యాచ్‌లలో- 12,628 పరుగులు- 105(9 సెంచరీలు, 96 అర్ధ శతకాలు)
👉4. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 296 మ్యాచ్‌లు- 10,677 పరుగులు- 100(11 సెంచరీలు, 89 అర్ధ శతకాలు)
👉5. జోస్‌ బట్లర్‌(ఇంగ్లండ్‌)- 413 మ్యాచ్‌లు- 11,484 పరుగులు- 88(8 సెంచరీలు, 80 అర్ధ శతకాలు).

చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్‌: రోహిత్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement