PC: Times of India
పాకిస్తాన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి పాక్‌కు ఏదీ కలిసిరావడం లేదు. వన్డే వరల్డ్‌కప్ లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టిన బాబర్ సేన.. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ గ్రూపు స్టేజిని దాటలేకపోయింది.
అదేవిధంగా గత నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సైతం పాక్ ఘోర పరాభవం పొందింది. తమ టెస్టు క్రికెట్ హిస్టరీలో తొలిసారి బంగ్లాపై టెస్టు సిరీస్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటుంది.
సొంత జట్టు మాజీ ఆటగాళ్లే పాక్ టీమ్‌ను టార్గెట్ చేశారు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ చేరాడు. ప్రస్తుతం బాబర్ ఆజం వంటి టాప్ పాక్ ఆటగాళ్లు జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని యూనిస్ మండిపడ్డాడు.
"బాబర్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్ధాయికి తగ్గట్టు రాణిస్తే మెరుగైన ఫలితాలు వాటింతట అవే వస్తాయి. కానీ మన ప్లేయర్స్ ఆట కంటే అనవసర విషయాలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. నేను అన్ని చూశాకే ఇలా మాట్లాడుతున్నాను.
బాబర్ కచ్చితంగా విరాట్ కోహ్లి నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. విరాట్ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందకు భారత కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎన్నో వరల్డ్ రికార్డులను బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా ఉంటేనే దేశం కోసం ఆడనిట్లు కాదు, ఒక ప్లేయర్‌గా కూడా మన దేశానికి మంచి పేరును తీసుకు రావచ్చు. బాబర్‌కు నేను ఓ సలహా ఇవ్వాలనకుంటున్నాను.
బాబర్ ప్రస్తుతం తన ఆటపై దృష్టి పెట్టాలి. అతడు తన ఆట తీరును మెరుగుపరుచుకోవాలి. అనవసర విషయాలపై దృష్టిపెట్టకూడదు. తనపై భారీ అంచనాలు ఉన్నందున ప్రతిచోటా రాణించాలి.
అతడు తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమధానం చెప్పాలి. అంతే తప్ప సోషల్ మీడియాలో కాదు. ఆజం ఫిట్‌నెస్ మెరుగు పరుచుకోవాలి అని క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనిస్ పేర్కొన్నాడు.
చదవండి: ‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
Comments
Please login to add a commentAdd a comment