భారత్, పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు కలిసి ఒకే జట్టులో ఆడనున్నారా? చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి సహచరులుగా మారనున్నరా? అంటే అవునానే సమాధానమే వినిపిస్తుంది. ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి ఆడే ఆఫ్రో-ఆసియా కప్ మళ్లీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సమోద్ దామోదర్ సైతం ధ్రువీకరించారు.
ఐసీసీ కొత్త బాస్‌గా ఎంపికైన జైషా అధ్యక్షతన 2025లో ఆఫ్రో-ఆసియన్ కప్‌ను పునరుద్ధరించవచ్చని దామోదర్ వెల్లడించారు. ఒకవేళ ఇదే నిజమైతే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ క్రికెటర్లు కలిసి ఒకే జట్టు తరపున ఆడనున్నారు.
"ఆఫ్రో-ఆసియా కప్ అర్ధాంతంగా ఆగిపోయినందుకు చాలా బాధపడ్డాను. ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ తరపున మేము చాలా ప్రయత్నించాము. కానీ మా ఎఫెక్ట్ సరిపోలేదు. మళ్లీ ఇప్పుడు ఈ విషయాన్ని మరోసారి పరిశీలిస్తున్నాము.
వచ్చే ఏడాది నిర్వహించేందుకు ఈ టోర్నీ జరిగితే రాజకీయంగా ఉన్న విభేదాలు చెరిగిపోతాయి. దేశాల మధ్య రాజకీయ ఉద్రక్తలు ఉన్నప్పటకి, ఆటగాళ్ల మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు. వారు ఈ టోర్నీలో కలిసి ఆడేందుకు సిద్దంగా ఉంటారని నేను భావిస్తున్నాను" అని దామోదర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అస్సలు ఏంటి ఆఫ్రో-ఆసియా కప్?
2005లో తొలిసారి ఆఫ్రో- ఆసియా కప్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నీ ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగేది. ఈ టోర్నీలో ఆసియా దేశాల నుంచి ఆటగాళ్లు ఓ జట్టుగా, ఆఫ్రికా దేశాల నుంచి ఆటగాళ్లు ఓ జట్టుగా ఏర్పడి తలపడేవారు.
ఆసియా నుంచి భారత్,పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక.. ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే క్రికెట్ జట్ల ఆటగాళ్లు భాగమయ్యే వారు. గతంలో ఆసియా జట్టుకు దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్, ఇంజమామ్ ఉల్ హక్, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీ ఆడారు. మరోవైపు ఆఫ్రికా జట్టుకు షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు.
ఈ టోర్నీ చివరగా ఎప్పుడు జరిగిదంటే?
ఆఫ్రో- ఆసియాకప్ చివరగా 2007లో జరిగింది. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత ఈ టోర్నీ ఆగిపోయింది. ఆ తర్వాత భారత్- పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఈ టోర్నీ కనమరుగు అయిపోయింది.
కాగా ఈ టోర్నీని 2023లోనే తిరిగి పునరుద్దించేందుకు ప్రయత్నించారు. కానీ ఆసియా క్రికెట్ అసోసియేషన్ మధ్య అంతర్గత విబేధాలు నెలకొనడంతో ఈ టోర్నీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఐసీసీ కొత్త చైర్మెన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనుండడంతో ఈ టోర్నీ పునరుద్ధరణ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment