టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత్-పాకిస్తాన్ మెగా సమరానికి ముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సొంత జట్టు సారధి బాబర్ ఆజమ్‌పై దుమ్మెతిపోశాడు. విరాట్‌తో బాబర్‌కు పోలిక ఏంటని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ విరాట్ కాలిగోటికి కూడా సమానం కాదని పరుష పదజాలాన్ని వాడాడు.
బాబర్ సెంచరీ చేసిన ప్రతిసారి పాక్ అభిమానులు అతన్ని విరాట్‌తో పోలుస్తారని.. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. బాబర్‌ను విరాట్‌తో పోలిస్తే అస్సలు ఒప్పుకోనని అన్నాడు. 16 ఏళ్ల కెరీర్‌లో విరాట్ 80 సెంచరీల సాయంతో దాదాపు 27000 పరుగులు చేస్తే.. బాబర్ తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో 31 సెంచరీల సాయంతో 13000 పైచిలుకు పరుగులు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో యూఎస్‌ఏపై బాబర్ ఆడిన ఇన్నింగ్స్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పసికూనల బౌలింగ్‌లోనే తేలిపోయిన బాబర్‌కు విరాట్‌తో పోటీపడే అర్హత ఎక్కడ ఉందని నిలదీశాడు. సాధారణ యూఎస్‌ఏ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలబడిన బాబర్.. ప్రపంచ స్థాయి బౌలర్లను ఏరకంగా ఎదుర్కొంటాడని ప్రశ్నించాడు. యూఎస్‌ఏతో మ్యాచ్‌లో బాబర్ ఆడిన ఇన్నింగ్సే పాక్ ఓటమికి ప్రధాన కారణమని దుమ్మెత్తిపోశాడు.
44 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్న బాబర్.. విరాట్‌తో సరిసమానమైన ప్లేయర్ అయ్యుంటే చివరి వరకు క్రీజ్‌లో నిలబడి పాక్‌ను గెలిపించేవాడని అన్నాడు. నేటి మెగా సమరంలో భారత్.. పాక్‌ను చిత్తు చేయడం ఖాయమని ఘంటాపథంగా తెలిపాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో పాక్‌పై భారత్ డామినేషన్ (6-1) కొనసాగుతుందని జోస్యం చెప్పాడు.
ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పోటీపడే ప్రతిసారి బౌలింగే తమ ప్రధాన బలమని జబ్బలు చరుచుకునే పాక్.. అదే బౌలింగ్ కారణంగా యూఎస్‌ఏ చేతిలో ఓడిందని అభిప్రాయపడ్డాడు. ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ తామాడిన తొలి మ్యాచ్‌లో పసికూన యూఎస్‌ఏ చేతిలో చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను మట్టికరిపించి గెలుపు జోష్‌లో ఉంది. భారత్, పాక్‌లు ఇవాళ (జూన్ 9) న్యూయార్క్ వేదికగా అమీతుమీకి సిద్దమయ్యాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్‌కు వేదిక అయిన న్యూయార్క్‌లో మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు న్యూయార్క్ మైదానంలోని పిచ్ ఇరు జట్లను కలవరపెడుతుంది. ఈ పిచ్ ఎవరికీ అంతుచిక్కని విధంగా స్పందిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment