
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లు పసికూనలపై ప్రతాపం చూపుతున్నాయి. శ్రీలంకపై నెదర్లాండ్స్ విజయం మినహా ఇప్పటివరకు జరిగిన అన్ని వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లే విజయం సాధించాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫ్లోరిడా, ట్రినిడాడ్ వేదికలుగా నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమకంటే చిన్న జట్లైన ఐర్లాండ్, స్కాట్లాండ్‌లపై విజయాలు సాధించాయి.
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో గెలుపొందగా.. స్కాట్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక-ఐర్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ.. ప్రతి ఒక్క ఆటగాడు తలో చేయి వేశారు. ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. దసున్ షనక (3.2-0-23-4) ఐర్లాండ్ పతనాన్ని శాశించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆఫ్ఘనిస్తాన్-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ నైబ్ (69), అజ్మతుల్లా (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్టఫర్ సోల్ (4-0-35-3), బ్రైడన్ కార్స్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ బౌలర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 56 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. ముజీబ్, కరీం జనత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వాట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత్‌తో బంగ్లాదేశ్ 'ఢీ'
వార్మప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (జూన్ 1) చివరి మ్యాచ్ జరుగనుంది. న్యూయార్క్‌లో ఇవాళ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఇవాల్టి నుంచే వరల్డ్‌కప్ రెగ్యులర్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి మొదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment