
మహిళల క్రికెట్‌లో శ్రీలంక జట్టుకు వరుస షాక్‌లు తగలుతున్నాయి. ఆ జట్టు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో వరుస మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతుంది. తొలుత టీ20 సిరీస్‌ను సమం చేసుకుని బయటపడ్డ శ్రీలంక.. తాజాగా వన్డే సిరీస్‌ను ఐర్లాండ్‌కు కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై ఐర్లాండ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆమీ హంటర్ (66), లేయా పాల్ (81), రెబెకా స్టోకెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, అచిని కులసూరియ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమారి ఆటపట్టు ఓ వికెట్ దక్కించుకుంది.
అనంతరం 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను హర్షిత సమరవిక్రమ (105) సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసింది. లంక ఇన్నింగ్స్‌లో హర్షితతో పాటు కవిష దిల్హరి (53) కూడా రాణించింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ 3, జేన్ 2, ఓర్లా, ఆమీ, ఫ్రేయా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఐర్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడు వన్డే ఆగస్ట్ 20న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment