
మహిళల టీ20 క్రికెట్‌లో పసికూన ఐర్లాండ్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాకిచ్చింది. నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఓర్లా ప్రెండర్‌గాస్ట్ ఆల్‌రౌండ్ షోతో (2/31, 51 బంతుల్లో 80; 13 ఫోర్లు) అదరగొట్టి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
ఆఖరి ఓవర్‌లో ఐర్లాండ్ గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. మ్యాడీ విలియర్స్ (ఇంగ్లండ్ బౌలర్) వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి భయపెట్టింది. అయినా ఐర్లాండ్ ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.
The celebrations by Irish women after beating England women for the first time ever in a T20i. ❤️pic.twitter.com/H6pdzWzLuL
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బేమౌంట్ (40), స్కోల్‌ఫీల్డ్ (34), బ్రైయోనీ స్మిత్ (28), జార్జియా ఆడమ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, ఆర్లీన్ కెల్లీ, ఆమీ మాగ్యూర్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. మరో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రెండర్‌గాస్ట్ (80).. గ్యాబీ లెవిస్ (38), లియా పాల్ (27 నాటౌట్) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించింది.
చివరి ఓవర్‌లో కాసేపు నాటకీయ పరిణామాలు (ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది) చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఐర్లాండ్‌నే విజయం వరించింది. ఐర్లాండ్ దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.