మహిళల క్రికెట్‌లో నిన్న (జులై 1) జరిగిన వేర్వేరు ఫార్మాట్ల మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు విజయాలు సాధించాయి. మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా, 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో వన్డేలో ఐర్లాండ్‌పై విండీస్ 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
రాణించిన బెత్ మూనీ..
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బెత్ మూనీ (61) అజేయ అర్ధశతకంతో రాణించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు తహిళ మెక్‌గ్రాత్ (40), ఆష్లే గార్డ్‌నర్ (31) సహకరించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఆసీస్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో (ఒక టెస్ట్, 3 టీ20లు, 3 వన్డేలు) ఆసీస్ 6-0 ఆధిక్యంలోకి (ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది) దూసుకెళ్లింది.
స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ అజేయ అర్ధశతకాలు..
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం విండీస్‌లో పర్యటిస్తున్న ఐర్లాండ్.. నిన్న జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైంది. ఫలితంగా ఆ జట్టు 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది (వర్షం కారణంగా రెండో వన్డే రద్దైంది).
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో గాబీ లెవిస్ (95 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. స్టెఫానీ టేలర్ (79), చినెల్ హెన్రీ (53) అజేయ అర్ధశతకాలు సాధించి విండీస్‌ను విజయతీరాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment