సమరానికి సిద్ధం
►వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటుతాం
►లోపాలు సరిదిద్దుకున్నాం
►విదేశాల్లో నిలకడగా ఆటతీరు
►భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్
మిథాలీ రాజ్... భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈమె ఇప్పుడు విజయ సారథి. ఓ కెప్టెన్‌గా ముందుండి నడిపించడమే కాదు... నిలకడగా గెలుపిస్తోంది. ఘన విజయాలతో దూసుకెళుతున్న మిథాలీ సేన లక్ష్యం ప్రపంచకప్. భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్న ఆమె... క్రికెటర్లకు శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ ఫిట్‌నెస్ కూడా కీలకమంటోంది. తమజట్టు ఇప్పుడు బాగా రాటుదేలిందని, వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతామంది. ఇంకా ఏం చెప్పిందంటే...
ఇపుడు విదేశీ గడ్డపైనా గెలుస్తున్నాం...
గతంలో మేం విదేశీ పర్యటనల్లో తేలిపోయేవాళ్లం. గెలిచేందుకు ఆపసోపాలు పడ్డా చివరకు ఓటమే ఎదురయ్యేది. ఒకటి అరా గెలిచినా... సిరీస్ విజయాలేవీ లేవు. ఇప్పుడు అక్కడా నిలకడైన విజయాలు సాధిస్తున్నాం. ఇది జట్టుకు సానుకూలాంశం. ఆశావహ దృక్పథంతో ముందడుగు వేసేందుకు ఇలాంటి ఫలితాలు దారి చూపుతాయి.
ఆట అభివృద్ధికి ఇదో అవకాశం...
పురుషుల క్రికెట్‌లాగే ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ మ్యాచ్‌ల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుండటం సంతోషకరం. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇదో చక్కని వేదిక. ఇప్పుడు మా ఆటతీరుతో ప్రేక్షకులను ఆకర్షిస్తాం. భారత్‌లో మా ఆటకు ప్రజాదరణ పెంచేందుకు ఇది మంచి అవకాశం. ఈ ప్రపంచకప్ ద్వారా మేం ప్రముఖంగా నిలిచేందుకు, చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాం.
విజయాల ఊపు కొనసాగించలేకే...
గత ప్రపంచకప్‌లలో బాగా ఆడినా టైటిల్ గెలవలేకపోయాం. ప్రారంభ మ్యాచ్‌ల్లో చక్కని ప్రదర్శనతో గెలిచాం. తదనంతరం ఈ విజయాల జోరును కొనసాగించలేకపోయాం. దీంతో కీలకమైన మ్యాచ్‌ల్లో ఓడటం, టైటిల్ వేటకు దూరమవడం జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. జట్టు కూర్పు బాగుంది. వరుసగా నాలుగు వన్డే సిరీస్‌లు గెలిచాం.
ఫీల్డింగ్‌పై కన్నేశాం...
బౌలింగ్, బ్యాటింగ్ విభాగం బాగానే ఉన్నా... ఫీల్డింగ్ చాలా కీలకమైంది. ఇందులో ఎప్పటికప్పుడు మెరుగవ్వాల్సిందే. కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ పరిస్థితుల్ని అప్పటికప్పుడు మార్చేయొచ్చు. శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక స్థైర్యం కూడా ఆటపై ప్రభావం చూపిస్తుంది. మెంటల్ ఫిట్‌నెస్‌తోనే ఎలాంటి ఎత్తిడినైనా అధిగమించవచ్చు.
ముంబైలో శిబిరం
ప్రపంచకప్‌కు ముందు మహిళల జట్టుకు ముంబైలో వచ్చే నెల 6 నుంచి 10 వరకు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ వెంటనే 11న ఇంగ్లండ్‌కు పయనమవుతుంది. అక్కడ కివీస్(19న), శ్రీలంక(21న)లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రధాన టోర్నీ జూన్ 24 నుంచి జరుగుతుంది. అదే రోజు ఇంగ్లండ్‌తో భారత మహిళలు తలపడతారు.