Captain mithali Raj
-
2021 ప్రపంచకప్ కూడా ఆడతానేమో!
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తన మనసు మార్చుకుంది. ప్రస్తుతమున్న ఫామ్‌లో ఉండి, ఫిట్నెస్ సహకరిస్తే 2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కూడా ఆడతానని స్వయంగా మిథాలీరాజ్ చెప్పింది. జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఇదే నా చివరి వరల్డ్ కప్ అని పేర్కొన్న మిథాలీ... తాజాగా ఫిట్‌గా ఉంటే తన కెరీర్లో ఆరో వరల్డ్ కప్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. రానున్న మూడేళ్ల కాలం తన భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పింది. ప్రస్తుతానికి తన దృష్టంతా 2018లో జరిగే ఇతర టోర్నీలతో పాటు, టి20 ప్రపంచకప్‌పైనే ఉందని తెలిపింది. వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి వచ్చే జనవరి వరకు భారత షెడ్యూల్ ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు భారత మహిళల జట్టు 2018 ఫిబ్రవరిలో దక్షిణా ప్రికాలో పర్యటించనుంది. వన్డే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ తమ తొలి రౌండ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వెల్లడించింది. ఫిబ్రవరి 5నుంచి 10వరకు ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. -
రాణించిన మిథాలీ
వార్మప్ మ్యాచ్‌లో భారత్ గెలుపు చెస్టెర్ఫీల్డ్: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ సన్నాహాల్లో బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 109 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి, కెప్టెన్ మిథాలీరాజ్ (89 బంతుల్లో 85; 11 ఫోర్లు), పూనమ్ రౌత్ (79 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత శ్రీలంక 48.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ రాజేశ్వరి (4/12) స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తలవంచారు. శిఖా పాండే 2 వికెట్లు తీసింది. -
వార్మప్‌లో భారత్‌కు నిరాశ
డెర్బీ: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు తేలిపోయింది. డెర్బీ కౌంటీ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై గెలిచింది. టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగి 45.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ పూనమ్ రౌత్ (65 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మోనా మేశ్రమ్ (57 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (21) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 26.3 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. రాచెల్ ప్రిస్ట్ (57 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1సిక్స్) అర్ధ సెంచరీతో రాణించింది. మిగతా వారిలో సుజి బేట్స్ (30), కటే మార్టిన్ (29 నాటౌట్), సోఫి డివైన్ (29 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 2 వికెట్లు, ఏక్తా బిస్త్ ఒక వికెట్ పడగొట్టారు. -
సమరానికి సిద్ధం
►వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటుతాం ►లోపాలు సరిదిద్దుకున్నాం ►విదేశాల్లో నిలకడగా ఆటతీరు ►భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మిథాలీ రాజ్... భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈమె ఇప్పుడు విజయ సారథి. ఓ కెప్టెన్‌గా ముందుండి నడిపించడమే కాదు... నిలకడగా గెలుపిస్తోంది. ఘన విజయాలతో దూసుకెళుతున్న మిథాలీ సేన లక్ష్యం ప్రపంచకప్. భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్న ఆమె... క్రికెటర్లకు శారీరక ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా కీలకమంటోంది. తమజట్టు ఇప్పుడు బాగా రాటుదేలిందని, వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతామంది. ఇంకా ఏం చెప్పిందంటే... ఇపుడు విదేశీ గడ్డపైనా గెలుస్తున్నాం... గతంలో మేం విదేశీ పర్యటనల్లో తేలిపోయేవాళ్లం. గెలిచేందుకు ఆపసోపాలు పడ్డా చివరకు ఓటమే ఎదురయ్యేది. ఒకటి అరా గెలిచినా... సిరీస్ విజయాలేవీ లేవు. ఇప్పుడు అక్కడా నిలకడైన విజయాలు సాధిస్తున్నాం. ఇది జట్టుకు సానుకూలాంశం. ఆశావహ దృక్పథంతో ముందడుగు వేసేందుకు ఇలాంటి ఫలితాలు దారి చూపుతాయి. ఆట అభివృద్ధికి ఇదో అవకాశం... పురుషుల క్రికెట్‌లాగే ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ మ్యాచ్‌ల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుండటం సంతోషకరం. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇదో చక్కని వేదిక. ఇప్పుడు మా ఆటతీరుతో ప్రేక్షకులను ఆకర్షిస్తాం. భారత్‌లో మా ఆటకు ప్రజాదరణ పెంచేందుకు ఇది మంచి అవకాశం. ఈ ప్రపంచకప్ ద్వారా మేం ప్రముఖంగా నిలిచేందుకు, చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. విజయాల ఊపు కొనసాగించలేకే... గత ప్రపంచకప్‌లలో బాగా ఆడినా టైటిల్ గెలవలేకపోయాం. ప్రారంభ మ్యాచ్‌ల్లో చక్కని ప్రదర్శనతో గెలిచాం. తదనంతరం ఈ విజయాల జోరును కొనసాగించలేకపోయాం. దీంతో కీలకమైన మ్యాచ్‌ల్లో ఓడటం, టైటిల్ వేటకు దూరమవడం జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. జట్టు కూర్పు బాగుంది. వరుసగా నాలుగు వన్డే సిరీస్‌లు గెలిచాం. ఫీల్డింగ్‌పై కన్నేశాం... బౌలింగ్, బ్యాటింగ్ విభాగం బాగానే ఉన్నా... ఫీల్డింగ్ చాలా కీలకమైంది. ఇందులో ఎప్పటికప్పుడు మెరుగవ్వాల్సిందే. కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ పరిస్థితుల్ని అప్పటికప్పుడు మార్చేయొచ్చు. శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక స్థైర్యం కూడా ఆటపై ప్రభావం చూపిస్తుంది. మెంటల్ ఫిట్నెస్తోనే ఎలాంటి ఎత్తిడినైనా అధిగమించవచ్చు. ముంబైలో శిబిరం ప్రపంచకప్‌కు ముందు మహిళల జట్టుకు ముంబైలో వచ్చే నెల 6 నుంచి 10 వరకు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ వెంటనే 11న ఇంగ్లండ్‌కు పయనమవుతుంది. అక్కడ కివీస్(19న), శ్రీలంక(21న)లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రధాన టోర్నీ జూన్ 24 నుంచి జరుగుతుంది. అదే రోజు ఇంగ్లండ్‌తో భారత మహిళలు తలపడతారు. -
జోరు కొనసాగిస్తారా!
► నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తొలిపోరు ► మహిళల టి20 ప్రపంచకప్ బెంగళూరు: పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకపై సిరీస్ విజయాలు సాధించిన భారత మహిళల జట్టు... కీలకమైన టి20 ప్రపంచకప్‌కు సిద్ధమైంది. నేడు (మంగళవారం) జరగనున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో ఆడిన వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సెమీస్‌కు చేరిన భారత్... చివరి రెండుసార్లు మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నమెంట్లో మరోసారి సెమీస్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఏడుగురు క్రీడాకారిణిలకు 2014 టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. ఇక జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్ గత నాలుగు టోర్నీల్లోనూ పాల్గొన్నారు. దీంతో సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకుని ఈసారి ఎలాగైనా కప్ చేజిక్కించుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిథాలీ, వనిత, కౌర్, మందన సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్ ఒత్తిడికి లోనుకావడం కాస్త ప్రతికూలాంశంగా మారింది. బౌలింగ్‌లో పేసర్ జులన్ గోస్వామి, స్పిన్నర్ ఏక్తా బిస్త్, అనుజా పాటిల్‌ల బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థికి పెద్ద సవాలే. వీళ్లు ముగ్గురు రాణిస్తే భారత్ విజయం నల్లేరు మీద నడకే. మరోవైపు జహనరా నేతృత్వంలోని బంగ్లా జట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగానే కుదురుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే సత్తా లేకపోయినా సమష్టిగా ఆడుతోంది. బ్యాటింగ్‌లో కాస్త నిలకడను చూపెడితే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం ఖాయం. వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పోరాటం చేసైనా ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చి టోర్నీలో ముందంజ వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తోంది. మ.గం 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
మా తొలి లక్ష్యం సెమీస్‌కు చేరడం: మిథాలీ
స్వదేశంలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరడం భారత జట్టు తొలి లక్ష్యమని కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై సిరీస్ విజయాలు సాధించడంతో జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపింది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల కెప్టెన్లతో కలిసి మిథాలీ బెంగళూరులో మీడియా సమావేశంలో పాల్గొంది.