సెమీఫైనల్లో 2–0తో జపాన్‌పై ఘనవిజయం
నేడు చైనాతో టైటిల్ పోరు సాయంత్రం గం. 4:45 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాజ్‌గిర్ (బిహార్): మరోసారి సాధికారిక ఆటతీరుతో అలరించిన భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–0 గోల్స్ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ (48వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.
లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నేడూ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా దక్షిణ కొరియా (2010, 2011లలో) జట్టు తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందుతుంది. గతంలో భారత జట్టు 2016, 2023లలో విజేతగా నిలిచింది. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీ సాధించింది.
జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్‌లు
లభించగా... ఒక్కదానిని కూడా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లేదంటే భారత గెలుపు ఆధిక్యం భారీగా ఉండేది. మరోవైపు జపాన్ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్‌కే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment