ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ
యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మూడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన భారత పురుషుల జట్టు వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో సర్దార్ సింగ్ బృందం 2-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు మలేసియాతో ఆడనుంది. బీరేందర్ లక్రా (34వ ని.), రమణ్‌దీప్ సింగ్ (51వ ని.) భారత్‌కు గోల్స్ అందించారు.
అటు సర్దార్ సింగ్ సేన డిఫెండర్ల వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ ఆసీస్ ఎనిమిదో నిమిషంలో అరన్ జలేస్కి, తొమ్మిదో నిమిషంలో జేమీ డ్వేయర్ గోల్స్‌తో షాకిచ్చింది. ఆ తర్వాత సిరియెల్లో (26,33,44వ నిమిషాల్లో), కీరన్ గోవర్స్( 43వ ని.) గోల్స్ చేయడంతో ఆసీస్‌కు భారీ విజయం దక్కింది. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత జట్టు మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో ఆడుతుంది.