సర్దార్‌ సింగ్‌పై పోలీసుల విచారణ | Sardar Singh called for questioning by U.K. police | Sakshi
Sakshi News home page

సర్దార్‌ సింగ్‌పై పోలీసుల విచారణ

Published Tue, Jun 20 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

సర్దార్‌ సింగ్‌పై పోలీసుల విచారణ

సర్దార్‌ సింగ్‌పై పోలీసుల విచారణ

భారత హాకీ జట్టుకు ముందస్తు సమాచారం ఇవ్వని ఇంగ్లండ్‌ పోలీసులు

లండన్‌: హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌ లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు ఇంగ్లండ్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌పై గతేడాది నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా యార్క్‌షైర్‌ పోలీసులు అతడిని విచారణకు రావాలని ఆదేశించారు. అయితే టోర్నీ జరుగుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు ఇలాంటి చర్యకు దిగడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఇబ్బందికి గురి చేసింది.

 ఇంగ్లండ్‌లో నివసించే భారత సంతతి హాకీ క్రీడాకారిణి, అతడి మాజీ ప్రియురాలు ఆశ్పాల్‌ భోగల్‌.. సర్దార్‌ సింగ్‌పై కేసు వేసింది. తనపై భారత్, ఇంగ్లండ్‌లో సర్దార్‌ సింగ్‌ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ‘జట్టంతా లండన్‌లో ఉన్న సమయంలో సర్దార్‌ను విచారణ కోసం లీడ్స్‌కు రమ్మన్నారు. ఇది కొత్త కేసా? పాతదేనా? అనే విషయం కూడా మాకు తెలీదు. సర్దార్‌ దొంగచాటుగా ఇక్కడ ఉండటం లేదు. మంగళవారం నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్‌ ఉన్న తరుణంలో దాదాపు 12 గంటల ప్రయాణం దూరంలో ఉన్న నగరానికి పిలిపించడం ఏమిటి?’ అని జట్టు అధికారి ఒకరు ప్రశ్నించారు.

అక్రమార్కులకు నిలయం...
మరోవైపు భారత్‌లో అక్రమాలు చేసిన వారంతా తెలివిగా ఇంగ్లండ్‌కు వెళ్లి నివసిస్తుంటారని, ఆ దేశం అలాంటి వారిని చక్కగా ఆదరిస్తుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా విమర్శించారు. ‘ఒకవేళ ఇంగ్లండ్‌ ఆటగాడిని భారత్‌లో ఉన్నప్పుడు పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి విచారిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఇంగ్లండ్‌తో పాటు ప్రపంచ మీడియా స్పందన ఏమిటో చూడాలనుంది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంగ్లండ్‌లోని భారత హైకమిషన్‌ జోక్యం చేసుకునేలా భారత మీడియా ప్రయత్నించాలి’ అని హాకీ ఇండియా మాజీ అధ్యక్షుడైన బాత్రా విజ్ఞప్తి చేశారు.

నేడు నెదర్లాండ్స్‌తో పోరు...
వరుసగా మూడు విజయాలతో ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన భారత హాకీ జట్టు నేడు (మంగళవారం) నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. స్కాట్లాండ్, కెనడా, పాక్‌ జట్లను చిత్తుగా ఓడిస్తూ వచ్చిన భారత్‌ ఇప్పుడు తమకన్నా మెరుగైన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ జట్టుపై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. నెదర్లాండ్స్‌ కూడా పాక్, స్కాట్లాండ్‌పై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement