భారత్ సంచలనం
- కాంస్య పతకం నెగ్గిన సర్దార్ సేన
- నెదర్లాండ్స్‌పై ‘షూటౌట్’లో విజయం
- హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ
రాయ్‌పూర్: ఆద్యంతం పట్టుదలతో పోరాడిన భారత హాకీ జట్టు ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం నెగ్గి సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా ‘షూటౌట్’లో 3-2తో అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 5-5 గోల్స్‌తో సమంగా ఉండటం విశేషం.
రెగ్యులర్ టైమ్‌లో భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (39వ, 51వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (47వ, 55వ ని.లో) రెండేసి గోల్స్ చేయగా... ఆకాశ్‌దీప్ సింగ్ (56వని.లో) ఒక గోల్ సాధించాడు. నెదర్లాండ్స్ జట్టులో మిర్కో ప్రుసెర్ (9వ ని.లో), వాన్‌డెర్ షూట్ నీక్ (25వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... వాన్‌డెర్ వీర్‌డెన్ మింక్ (54వ, 58వ, 60వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఇక ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ తరఫున బిల్లీ బాకెర్, వాన్ సెవ్ సఫలమవ్వగా... హెర్ట్‌బెర్గర్, మిర్కో ప్రుసెర్, వాలెంటిన్ షాట్‌లను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. భారత్ నుంచి డానిష్ ముజ్తబా, అమీర్ ఖాన్ విఫలమవ్వగా... బీరేంద్ర లాక్రా, సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ బంతిని లక్ష్యానికి చేర్చి భారత విజయాన్ని ఖాయం చేశారు.
మరోవైపు ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 2-1 గోల్స్ తేడాతోబెల్జియంను ఓడించి విజేతగా నిలిచింది. 33 ఏళ్ల తర్వాత భారత జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో కాంస్య పతకం నెగ్గడం విశేషం. చివరిసారి భారత్ 1982 చాంపియన్స్ ట్రోఫీలో 5-4తో పాకిస్తాన్‌ను ఓడించి కాంస్య పతకం సాధించింది.