మరో విజయంపై గురి | Hockey World League Semi-finals: India Vs Poland | Sakshi
Sakshi News home page

మరో విజయంపై గురి

Published Mon, Jun 22 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

మరో విజయంపై గురి

మరో విజయంపై గురి

నేడు పోలండ్‌తో భారత్ ‘ఢీ’
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్


యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో గట్టెక్కిన భారత పురుషుల హాకీ జట్టు మరో విజయంపై దృష్టి పెట్టింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో భాగంగా మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని, ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైన ఆటతీరును కనబరచాలనే పట్టుదలతో సర్దార్ సింగ్ బృందం ఉంది. ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే ఎనిమిది స్థానాలు దిగువన ఉన్నప్పటికీ పోలండ్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశముంది.

చురుగ్గా కదులుతూ ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లే పలువురు ఫార్వర్డ్స్ పోలండ్ జట్టులో ఉన్నారు. భారత రక్షణపంక్తి అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ఫలితం వస్తుంది. ‘ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడంలేదు. పోలండ్ ఏ ర్యాంక్‌లో ఉందనే విషయంతో అసలు పనిలేదు. ఈ టోర్నీకి మేము పర్యాటకుల్లా రాలేదు. రియో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించినప్పటికీ ఈ టోర్నీలోనూ మంచి ఫలితాలు సాధించాలనే కసితో ఉన్నాం’ అని భారత కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ఇదే టోర్నీ మహిళల విభాగం లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది.

వాల్మీకికి రూ. లక్ష నజరానా
తన కెరీర్‌లో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే గోల్ చేసిన భారత యువ ఆటగాడు దేవేందర్ వాల్మీకికి హాకీ ఇండియా ప్రోత్సాహకంగా లక్ష రూపాయల నజరానాను ప్రకటించింది. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవేందర్ రెండో గోల్‌ను అందించాడు. ‘దేవేందర్ క్రమశిక్షణ కలిగిన ఆటగాడు. జూనియర్ స్థాయిలోనూ అతను చాలా బాగా ఆడాడు’ అని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ మహ్మద్ ముస్తాక్ అన్నారు.

పురుషుల విభాగం
భారత్ + పోలండ్
రాత్రి గం. 7.30 నుంచి


మహిళల విభాగం

భారత్ + న్యూజిలాండ్
సాయంత్రం గం. 5.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement