Champions Trophy: వరుణ్‌ ‘మిస్టరీ’ దెబ్బ  | Champions Trophy: Varun Chakravarthy takes 5 wickets as India defeat New Zealand | Sakshi
Sakshi News home page

Champions Trophy: వరుణ్‌ ‘మిస్టరీ’ దెబ్బ 

Published Mon, Mar 3 2025 3:56 AM | Last Updated on Mon, Mar 3 2025 3:56 AM

Champions Trophy: Varun Chakravarthy takes 5 wickets as India defeat New Zealand

కుప్పకూలిన న్యూజిలాండ్‌ 

44 పరుగులతో టీమిండియా గెలుపు

రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌

వరుణ్‌ చక్రవర్తికి 5 వికెట్లు 

రేపు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ‘ఢీ’  

చాంపియన్స్‌ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లలో 229, 242 పరుగుల లక్ష్యాలను భారత్‌ అలవోకగా ఛేదించింది. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశం  వచ్చింది. న్యూజిలాండ్‌ పదునైన బౌలింగ్‌ ముందు భారీ స్కోరు చేయడం కష్టంగా మారింది. టాప్‌–3 బ్యాటర్లు 30 పరుగులకే వెనుదిరగ్గా... చివరకు టీమిండియా 249 పరుగులకే పరిమితమైంది. 

ఈ స్కోరును నిలబెట్టుకోగలదా అనే సందేహాలు... అయితే మన స్పిన్నర్లు విన్నర్లుగా మారారు... భారత స్పిన్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడిన కివీస్‌ ఓటమిని ఆహ్వానించింది.

 చాంపియన్స్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ ఆడిన ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి ముందుండి నడిపించగా... కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ విజయంలో తలా ఓ చేయి వేశారు. ఇక భారత జట్టుకు అసలైన సవాల్‌ మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా  రూపంలో ఎదురవుతోంది. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే వన్డే మ్యాచ్‌లో తలపడనుండగా... బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్‌ ఎదుర్కొంటుంది.   

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ లీగ్‌ దశను అజేయంగా ముగించింది. సెమీఫైనల్‌ స్థానం ఖాయమైపోయిన తర్వాత ఆడిన చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ గెలిచిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

 శ్రేయస్‌ అయ్యర్‌ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్‌  పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అయ్యర్, అక్షర్‌ నాలుగో వికెట్‌కు 22.4 ఓవర్లలో 98 పరుగులు జోడించారు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్‌ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది.

 కేన్‌ విలియమ్సన్‌ (120 బంతుల్లో 81; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి (5/42) తన కెరీర్‌లో రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మంగళవారం ఇదే మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో భారత్‌ తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ బుధవారం లాహోర్‌లో జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్‌ ‘బి’ టాపర్‌ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.  

కీలక భాగస్వామ్యం... 
హెన్రీ, జేమీసన్‌ స్వింగ్‌ బౌలింగ్‌తో కట్టడి చేయడంతో ఆరంభంలో పరుగులు చేయడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 15 పరుగుల వ్యవధిలో గిల్‌ (7 బంతుల్లో 2), రోహిత్‌ (17 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌), కోహ్లి (14 బంతుల్లో 11; 2 ఫోర్లు) వెనుదిరిగారు. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా కోహ్లి బలంగా షాట్‌ కొట్టగా... గాల్లోకి ఎగురుతూ గ్లెన్‌ ఫిలిప్స్‌ అత్యద్భుతంగా క్యాచ్‌ అందుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. తన 300వ వన్డేలో తక్కువ స్కోరుకే అవుటై కోహ్లి నిరాశగా మైదానం వీడాడు. 30/3 వద్ద ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు అయ్యర్, అక్షర్‌ ప్రయత్నించారు. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఆడటంతో ఒక దశలో వరుసగా 51 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే ఆ తర్వాత స్కోరు వేగం కాస్త పెరిగింది.

 రూర్కే ఓవర్లో 3 ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించిన అయ్యర్‌ 75 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్‌ను అవుట్‌ చేసి రచిన్‌ ఈ జోడీని విడదీయగా... 10 పరుగుల వ్యవధిలో అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ (29 బంతుల్లో 23; 1 ఫోర్‌) పెవిలియన్‌ చేరారు. జడేజా (20 బంతుల్లో 16; 1 ఫోర్‌) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే చివర్లో పాండ్యా మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ 250 పరుగులకు చేరువగా రాగలిగింది. జేమీసన్‌ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 4, 6 బాదాడు. భారత్‌ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్‌ హర్షిత్‌ రాణాకు విశ్రాంతినిస్తూ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది.  

విలియమ్సన్‌ మినహా... 
ఛేదనలో కివీస్‌కు సరైన ఆరంభం లభించలేదు. అక్షర్‌ చక్కటి క్యాచ్‌తో రచిన్‌ రవీంద్ర (12 బంతుల్లో 6)ను అవుట్‌ చేయడంతో భారత్‌కు తొలి వికెట్‌ లభించింది. ఆ తర్వాత కూడా న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. ఒకవైపు విలియమ్సన్‌ పట్టుదలగా నిలబడినా... మరో ఎండ్‌లో బ్యాటర్లంతా వరుస కట్టి పెవిలియన్‌ చేరారు. భారత స్పిన్నర్ల బంతులను అర్థం చేసుకోలేక వరుసగా నలుగురు బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరడం విశేషం. 

మిచెల్‌ (35 బంతుల్లో 17; 1 ఫోర్‌), లాథమ్‌ (20 బంతుల్లో 14), ఫిలిప్స్‌ (8 బంతుల్లో 12; 1 సిక్స్‌), బ్రేస్‌వెల్‌ (3 బంతుల్లో 2) విఫలం కాగా... మరో ఎండ్‌లో 77 బంతుల్లో విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 40 ఓవర్లలో కివీస్‌ స్కోరు 165/6. మరో 60 బంతుల్లో 85 పరుగులు చేయాలి. 

చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగి పోతుండగా ఒత్తిడిలో భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్‌ అక్షర్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు వ్యక్తిగత స్కోర్లు 1, 32, 68 వద్ద రాహుల్‌ (రెండు), వరుణ్‌ క్యాచ్‌లు వదిలేయడంతో విలియమ్సన్‌ బతికిపోయాడు. మాజీ కెప్టెన్‌ అవుటవ్వడంతో కివీస్‌ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. చివర్లో కెపె్టన్‌ మైకేల్‌ సాంట్నర్‌ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. 54 పరుగుల తేడాతో ఆ జట్టు చివరి 6 వికెట్లు కోల్పోయింది.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) యంగ్‌ (బి) జేమీసన్‌ 15; గిల్‌ (ఎల్బీ) (బి) హెన్రీ 2; కోహ్లి (సి) ఫిలిప్స్‌ (బి) హెన్రీ 11; అయ్యర్‌ (సి) యంగ్‌ (బి) రూర్కే 79; అక్షర్‌ (సి) విలియమ్సన్‌ (బి) రచిన్‌ 42; రాహుల్‌ (సి) లాథమ్‌ (బి) సాంట్నర్‌ 23; పాండ్యా (సి) రచిన్‌ (బి) హెన్రీ 45; జడేజా (సి) విలియమ్సన్‌ (బి) హెన్రీ 16; షమీ (సి) ఫిలిప్స్‌ (బి) హెన్రీ 5; కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 249. 
వికెట్ల పతనం: 1–15, 2–22, 3–30, 4–128, 5–172, 6–182, 7–223, 8–246, 9–249. 
బౌలింగ్‌: హెన్రీ 8–0–42–5, జేమీసన్‌ 8–0–31–1, రూర్కే 9–0–47–1, సాంట్నర్‌ 10–1–41–1, బ్రేస్‌వెల్‌ 9–0–56–0, రచిన్‌ 6–0–31–1.  

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: యంగ్‌ (బి) వరుణ్‌ 22; రచిన్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 6; విలియమ్సన్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) అక్షర్‌ 81; మిచెల్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 17; లాథమ్‌ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 12; బ్రేస్‌వెల్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 2; సాంట్నర్‌ (బి) వరుణ్‌ 28; హెన్రీ (సి) కోహ్లి (బి) వరుణ్‌ 2; జేమీసన్‌ (నాటౌట్‌) 9; రూర్కే (బి) కుల్దీప్‌ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్‌) 205. 
వికెట్ల పతనం: 1–17, 2–49, 3–93, 4–133, 5–151, 6–159, 7–169, 8–195, 9–196, 10–205. 
బౌలింగ్‌: షమీ 4–0–15–0, పాండ్యా 4–0–22–1, అక్షర్‌ 10–0–32–1, వరుణ్‌ 10–0–42–5, కుల్దీప్‌ 9.3–0–56–2, జడేజా 8–0–36–1.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement