కెప్టెన్‌గా సర్దార్ సింగ్ ఎంపిక
ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నీ
న్యూఢిల్లీ: భారత హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్ పునరాగమనంతో పాటు మరోసారి జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈనెల 27 నుంచి స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగే ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీకి విశ్రాంతి తీసుకున్న సర్దార్ సింగ్ తిరిగి కెప్టెన్‌గా వ్యవహరించనుండగా డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్, బీరేందర్ లక్రా రీఎంట్రీ ఇచ్చారు.
అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్పెయిన్ జట్లు తలపడే ఈ టోర్నీలో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. దీంతో వీఆర్ రఘునాథ్, కొతజిత్ సింగ్, లక్రా, రూపిందర్ పాల్‌లతో డిఫెన్స్ పటిష్టంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ మాదిరిగానే ఇందులోనూ అద్భుతంగా రాణించేందుకు కృషి చేస్తామని సర్దార్ విశ్వాసం వ్యక్తం చేశాడు.