'సర్దార్ పై రేప్ కేసు నమోదు చేయాలి'
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ పై రేప్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా సంఘం(డీసీబ్ల్యూ) డిమాండ్ చేసింది. సర్దార్ సింగ్ కు అనుకూలంగా పంజాబ్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అతడిపై పంజాబ్, ఢిల్లీలో కేసులు పెట్టినా పట్టించుకోడం లేదని తెలిపింది. దీనిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హాకీ ఇండియాకు నోటీసు జారీ చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సర్దార్ సింగ్ చిరకాల స్నేహితురాలు ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టామని డీసీపీ జతిన్ నార్వాల్ తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
దీని గురించి సర్దార్ సింగ్ ను అడగ్గా... 'ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేసింది. నేను ఎవరినీ నియంత్రించలేను. ఎవరి ఆలోచనలను మార్చలేదు. దీనిపై కామెంట్ చేయను. పంజాబ్ పోలీసులు ఆమె ఫిర్యాదును తోసిపుచ్చారు. నా ఆటపైనే దృష్టి పెట్టాను. ఒలింపిక్స్ గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నా'ని సమాధానం ఇచ్చాడు. ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు హాకీ ఇండియా చైర్మన్ నరేంద్ర బాత్రా నిరాకరించారు. తాను విదేశాల్లో ఉన్నానని, తిరిగొచ్చాక మాట్లాడతానని చెప్పారు.
2014, అక్టోబర్ లో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో తనపై సర్దార్ సింగ్ అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. హోటల్ పైనుంచి తోసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. 2012లో సోషల్ మీడియాతో సింగ్ పరిచయం అయ్యాడని.. 2014, ఫిబ్రవరిలో తమద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యాడని చెప్పింది. 2015, మేలో తనకు అబార్షన్ చేయించాడని వెల్లడించింది. దీనిపై ఈ ఏడాది జనవరి 31న పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది.