DCW
-
మహిళను రూ.10వేలకు అమ్మేసి..
లక్నో : యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ 10,000కు ఓ వ్యక్తికి మహిళను విక్రయించగా, సదరు వ్యక్తి ఆమెను పలువురి ఇళ్లలో పనిచేసేందుకు పురమాయించడంతో పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన వారిపై ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించడంతో బాధిత మహిళ తన ఒంటికి నిప్పంటించుకుంది. కాగా, మహిళ ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో ఘజియాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాము బాధిత మహిళ ఫిర్యాదుపై నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని యూపీ పోలీసులు వివరణ ఇచ్చారు. మహిళ ఫిర్యాదును నమోదు చేసేందుకు తిరస్కరించిన పోలీసులపై విచారణ చేపట్టాలని, బాధిత మహిళకు పరిహారం అందచేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌కు లేఖ రాశారు. యూపీ పోలీసుల చేతిలో ఆమె పరాభవానికి లోనయ్యారని, వారి తీరుతో బాధితురాలు సజీవ దహనానికి యత్నించారని చెప్పారు. కాగా, ఈ లేఖలో వెల్లడించిన వివరాల ప్రకారం.. పలువురి వద్ద నుంచి రుణాలు తీసుకున్న ఓ వ్యక్తి రూ 10,000కు బాధిత మహిళను హపూర్‌లో కొనుగోలు చేశారు. ఆమెను తనకు అప్పు ఇచ్చిన వారి ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమెకు జీతంగా ఎలాంటి మొత్తం చెల్లించకపోవడంతో పాటు ఆమెపై ఆయా ప్రదేశాల్లో సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డారు. తనపై వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు హూపూర్ ఎస్పీతో పాటు సీనియర్ పోలీస్ అధికారులను సంప్రదించగా ఆమె ఫిర్యాదును స్వీకరించలేదని, నిందితులపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు. పోలీసులు తీరుతో మనస్తాపం చెందిన మహిళ సజీవ దహనానికి పాల్పడింది. కాగా మహిళా కమిషన్ జోక్యంతో యూపీ పోలీసులు బాబూగఢ్ సర్పంచ్‌తో పాటు మరో 13 మందిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. మరోవైపు ఆమె సజీవ దహనానికి తనంతట తానే ప్రయత్నించిందా లేదా ఇతరుల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హపూర్ ఎస్పీ యశవీర్ సింగ్ చెప్పారు. -
16 మంది మహిళలకు విముక్తి
న్యూఢిల్లీ : వుమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠా చెర నుంచి 16 మంది మహిళలను ఢిల్లీ మహిళ కమిషన్(డీసీడబ్య్లూ) రక్షించింది. బుధవారం ఉదయం మునిర్క ప్రాంతంలో దాడులు చేపట్టిన కమిషన్ సభ్యులు.. ఒక గదిలో బంధించి ఉన్న మహిళలను గుర్తించారు. నేపాల్‌కు చెందిన మహిళలకు మాయ మాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకొచ్చారని డీసీడబ్య్లూ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. వారిని కొన్ని రోజుల్లోనే కువైట్, ఇరాక్‌లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ విచారణలో తేలిందన్నారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బాధితుల వద్ద నుంచి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్న ముఠా సభ్యులు వారిని గదిలో బంధించారని తెలిపారు. ఈ రాకెట్ గత ఎనిమిది నెలలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. గత 15 రోజుల్లోనే ఈ ముఠా ఏడుగురు యువతులను కువైట్, ఇరాక్‌లకు అక్రమ రవాణా చేసిందని వెల్లడించారు. కేంద్రాన్ని నిలదీసిన కేజ్రీవాల్ ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్లు ఎక్కడున్నారంటూ చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు వారి ఆధ్వర్యంలోనే ఉన్నారని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై లేదా అని మండిపడ్డారు. -
నెలకు నాకొచ్చేది రూ.30 వేలే: స్వాతి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ల మధ్య కొనసాగుతోన్న విబేధాలు ఉద్యోగుల వేతనాలకు ఎసరు పెట్టాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ లో పనిచేస్తోన్న పలువురు సిబ్బంది నెల జీతాల చెల్లింపులు నిలిచిపోయారు. దీంతో ఆ సంస్థ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం అన్యాయం, అక్రమం, అమానవీయం అని విమర్శించారు. సోమవాంర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన స్వాతి.. 'డీసీడబ్ల్యూ సిబ్బందిలో ఎక్కువ మంది యాసిడ్ బాధిత మహిళలున్నారు. పైగా శనివారాలు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తారు. ఉన్నపళంగా వేతనాలు ఆపేయడం దారుణం. లెఫ్టినెంట్ గవర్నర్ చేత నియమితురాలైన సెక్రటరీ అల్కా దివానే ఇదంతా చేయిస్తున్నారు. ఆమె ప్రోద్బలంతోనే వేతనాలు నిలిపేశారు'అని అన్నారు. 'డీసీడబ్ల్యూ ఉద్యోగుల్లో చాలామంది జీతాలు రూ. 25వేల లోపే. నాకొచ్చేదీ రూ.30 వేలే. సిబ్బందికి వేతనాలు ఇచ్చేవరకూ నాక్కూడా జీతం ఇవ్వొద్దని ఉన్నతాధికారులకు చెప్పా'నని స్వాతి పేర్కొన్నారు. అసలు వివాదానికి కారణం కూడా సిబ్బంది నియామకాలేనన్నది తెలిసిందే. కొద్ది నెలల కిందట డీసీడబ్ల్యూ చేపట్టిన సిబ్బంది నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సంస్థ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ను సెప్టెంబర్ లో ఢిల్లీ ఏసీబీ ప్రశ్నించింది. కాగా, తానే తప్పూ చేయలేదన్న స్వాతి.. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. -
అమ్మా.. నాన్నా.. ఎందుకిలా?
-
అమ్మా.. నాన్నా.. ఎందుకిలా?
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఘోర అమానుషం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతూ దాదాపు చావుకు దగ్గరైన ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడారు. అమ్మ తమని ఎందుకు వదిలివెళ్లిందో అర్థంకాక, నాన్న తిరిగి వస్తాడో రాడో తెలియక ఆ పిల్లలు తికమకపడుతున్నారు. ఢిల్లీలోని సమయ్‌పుర్ బాద్లీ ప్రాంతానికి చెందిన రోజీ, బబ్లూ కుటుంబం ఓ చిన్న గదిలో కాపురం ఉండేది. వాళ్లకు ఇద్దరు కూతుళ్లు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. ఏ ఉద్యోగం చేయని బబ్లూ రోజూ తాగి వచ్చి భార్యను, పిల్లల్ని వేధించేవాడు. దీంతో రెండు నెలల కిందట కొడుకుని తీసుకుని రోజీ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో అల్కా(8), జ్యోతి(3)లు తండ్రి ఉన్నా అనాథలయ్యారు. ఎప్పుడోగానీ ఇంటికొచ్చే బబ్లూ ఆగస్టు 15 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో గదిలో ఉండిపోయిన పిల్లలు తిండి, నీళ్లు లేక మలమూత్రాలను శుభ్రం చేయకపోవడంతో ఒళ్లంతా పుండ్లుపడిపోయి పిల్లలిద్దరూ దీనావస్థకు చేరుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఆగస్టు 19న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. గది తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు.. దాదాపు చావు అంచులకు వెళ్లిన పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలిద్దరూ శుక్రవారం నాటికి కొద్దిగా కోలుకున్నారు. తల్లి రోజీ జాడను కనిపెట్టిన పోలీసులకు ఆమె చెప్పిన సమాధానంతో షాక్ కు గురయ్యారు. 'నేనే దిక్కులేని బతుకీడుస్తున్నాను. ఇప్పుడా ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచుకోను? వాళ్లు నాకు వద్దే వద్దు' అని రోజీ పోలీసులకు తేగేసి చెప్పింది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ పిల్లల బాధ్యతను స్వీకరించేందుకు ముందుకొచ్చింది. డీసీడబ్ల్యూ చైర్మన్ స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ పిల్లలిద్దరినీ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తామని తెలిపారు. -
'సర్దార్ పై రేప్ కేసు నమోదు చేయాలి'
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ పై రేప్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా సంఘం(డీసీబ్ల్యూ) డిమాండ్ చేసింది. సర్దార్ సింగ్ కు అనుకూలంగా పంజాబ్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అతడిపై పంజాబ్, ఢిల్లీలో కేసులు పెట్టినా పట్టించుకోడం లేదని తెలిపింది. దీనిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హాకీ ఇండియాకు నోటీసు జారీ చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సర్దార్ సింగ్ చిరకాల స్నేహితురాలు ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టామని డీసీపీ జతిన్ నార్వాల్ తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీని గురించి సర్దార్ సింగ్ ను అడగ్గా... 'ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేసింది. నేను ఎవరినీ నియంత్రించలేను. ఎవరి ఆలోచనలను మార్చలేదు. దీనిపై కామెంట్ చేయను. పంజాబ్ పోలీసులు ఆమె ఫిర్యాదును తోసిపుచ్చారు. నా ఆటపైనే దృష్టి పెట్టాను. ఒలింపిక్స్ గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నా'ని సమాధానం ఇచ్చాడు. ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు హాకీ ఇండియా చైర్మన్ నరేంద్ర బాత్రా నిరాకరించారు. తాను విదేశాల్లో ఉన్నానని, తిరిగొచ్చాక మాట్లాడతానని చెప్పారు. 2014, అక్టోబర్ లో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో తనపై సర్దార్ సింగ్ అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. హోటల్ పైనుంచి తోసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. 2012లో సోషల్ మీడియాతో సింగ్ పరిచయం అయ్యాడని.. 2014, ఫిబ్రవరిలో తమద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యాడని చెప్పింది. 2015, మేలో తనకు అబార్షన్ చేయించాడని వెల్లడించింది. దీనిపై ఈ ఏడాది జనవరి 31న పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. -
ఆప్ నేతకు సమన్లు
న్యూఢిల్లీ: సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మహిళా కార్యకర్తను వేధించారనే ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేతకు సమన్లు జారీ చేసింది. పార్టీ నేత కుమార్ విశ్వాస్ పార్టీ మహిళా కార్యకర్తను వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరవ్వాలని ఆప్ నేతను కోరామని కమిషన్ ప్రతినిధి సోమవారం తెలిపారు. గతం సంవత్సర కాలంలో అమేధీలో పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నమహిళను లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వేధించినట్టుగా తమకు ఫిర్యాదు అందిందని ఆమె చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఆప్ కొట్టి పారేసింది. ఇంతవరకు తమకెలాంటి సమన్లు అందలేదని ఆప్ తెలిపింది. కాగా అవినీతి రహిత సమాజమే లక్ష్యమనే నినాదంతో ఢిల్లీ గద్దెనెక్కిన ఆప్ ప్రభుత్వాన్ని వరుస వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే పార్టీలో చీలిక అలజడి సృష్టించింది. ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ప్రకంపనలురేపింది. న్యాయశాఖ మంత్రి విద్యార్హతలపై రగడ ఇంకా చల్లారనేలేదు. ఇపుడు మహిళను వేధించిన కేసు. దీంతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.