
ఆప్ నేతకు సమన్లు
న్యూఢిల్లీ: సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మహిళా కార్యకర్తను వేధించారనే ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేతకు సమన్లు జారీ చేసింది. పార్టీ నేత కుమార్ విశ్వాస్ పార్టీ మహిళా కార్యకర్తను వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరవ్వాలని ఆప్ నేతను కోరామని కమిషన్ ప్రతినిధి సోమవారం తెలిపారు. గతం సంవత్సర కాలంలో అమేధీలో పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నమహిళను లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వేధించినట్టుగా తమకు ఫిర్యాదు అందిందని ఆమె చెప్పారు.
అయితే ఈ ఆరోపణలను ఆప్ కొట్టి పారేసింది. ఇంతవరకు తమకెలాంటి సమన్లు అందలేదని ఆప్ తెలిపింది. కాగా అవినీతి రహిత సమాజమే లక్ష్యమనే నినాదంతో ఢిల్లీ గద్దెనెక్కిన ఆప్ ప్రభుత్వాన్ని వరుస వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే పార్టీలో చీలిక అలజడి సృష్టించింది. ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ప్రకంపనలురేపింది. న్యాయశాఖ మంత్రి విద్యార్హతలపై రగడ ఇంకా చల్లారనేలేదు. ఇపుడు మహిళను వేధించిన కేసు. దీంతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.