కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులపై దాడులకు అమిత్ షా కారణం
కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు
తీవ్రంగా ఖండించిన భారత్... అసంబద్ధ ఆరోపణలు చేయొద్దని హితవు
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వ పెద్దల ప్రేలాపనలు ఆగడం లేదు. ఒకవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నప్పటికీ మరోవైపు వారు మరింత ఆజ్యం పోస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులపై దాడులకు, కుట్రలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమంటూ కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మోరిసన్ చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదురుతోంది. మోరిసన్ మంగళవారం కెనడా జాతీయ భద్రతా కమిటీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ అమిత్ షా ప్రస్తావన తీసుకొచ్చారు.
కెనడాలో ఉన్న సిక్కు వేర్పాటువాదులకు, ఖలిస్తానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించాలని, సిక్కులను భయాందోళనకు గురి చేయాలని, వారికి సంబంధించిన సమాచారం సేకరించాలంటూ భారత నిఘా అధికారులను అమిత్ షా ఆదేశించారని చెప్పారు. అయితే, అమిత్ షా ఈ ఆదేశాలిచి్చనట్లు కెనడాకు ఎలా తెలిసిందో మోరిసన్ వెల్లడించలేదు. 2023 జూన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్–కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే చాలావరకు క్షీణించాయి. అయినా కూడా కెనడా మంత్రి మోరిసన్ నోరుపారేసుకోవడం గమనార్హం.
కెనడా హైకమిషన్ ప్రతినిధికి నిరసన
కెనడా మంత్రి డేవిన్ మోరిసన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అర్థంపర్థం లేని, ఆధారాల్లేని ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ మండిపడ్డారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన భారత్, కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అసంబద్ధమైన ఆరోపణలతో పరిస్థితిని దిగజార్చవద్దని సూచించారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసే కుతంత్రాలు మానుకోవాలని కెనడాకు స్పష్టంచేశారు. కెనడా మంత్రులు, అధికారులు భారత్ గురించి అంతర్జాతీయ మీడియాకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు ఇస్తున్నారని రణ«దీర్ జైస్వా ల్ ఆరోపించారు. కెనడా మంత్రి మోరిస్ తాజా ఆరోపణల పట్ల భారత్‌లోని కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని తెలిపారు.
కెనడాలో భారత కాన్సులర్ సిబ్బందికి వేధింపులు
కెనడాలోని భారత కాన్సులర్ సిబ్బందిని కెనడా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని రణ«దీర్ జైస్వాల్ ఆరోపించారు. వారిపై ఆడియో, వీడియో నిఘా పెట్టిందని చెప్పారు. సిబ్బంది మధ్య సమాచార మారి్పడిని అడ్డుకుంటోందని వెల్లడించారు. తరచుగా వేధించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. దౌత్యపరమైన నిబంధనలు, ఒప్పందాలను కెనడా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై తమ నిరసనను కెనడా ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment