నెలకు నాకొచ్చేది రూ.30 వేలే: స్వాతి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ల మధ్య కొనసాగుతోన్న విబేధాలు ఉద్యోగుల వేతనాలకు ఎసరు పెట్టాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ లో పనిచేస్తోన్న పలువురు సిబ్బంది నెల జీతాల చెల్లింపులు నిలిచిపోయారు. దీంతో ఆ సంస్థ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం అన్యాయం, అక్రమం, అమానవీయం అని విమర్శించారు.
సోమవాంర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన స్వాతి.. 'డీసీడబ్ల్యూ సిబ్బందిలో ఎక్కువ మంది యాసిడ్ బాధిత మహిళలున్నారు. పైగా శనివారాలు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తారు. ఉన్నపళంగా వేతనాలు ఆపేయడం దారుణం. లెఫ్టినెంట్ గవర్నర్ చేత నియమితురాలైన సెక్రటరీ అల్కా దివానే ఇదంతా చేయిస్తున్నారు. ఆమె ప్రోద్బలంతోనే వేతనాలు నిలిపేశారు'అని అన్నారు.
'డీసీడబ్ల్యూ ఉద్యోగుల్లో చాలామంది జీతాలు రూ. 25వేల లోపే. నాకొచ్చేదీ రూ.30 వేలే. సిబ్బందికి వేతనాలు ఇచ్చేవరకూ నాక్కూడా జీతం ఇవ్వొద్దని ఉన్నతాధికారులకు చెప్పా'నని స్వాతి పేర్కొన్నారు. అసలు వివాదానికి కారణం కూడా సిబ్బంది నియామకాలేనన్నది తెలిసిందే. కొద్ది నెలల కిందట డీసీడబ్ల్యూ చేపట్టిన సిబ్బంది నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సంస్థ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ను సెప్టెంబర్ లో ఢిల్లీ ఏసీబీ ప్రశ్నించింది. కాగా, తానే తప్పూ చేయలేదన్న స్వాతి.. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.