ప్రతీకాత్మకచిత్రం
లక్నో : యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ 10,000కు ఓ వ్యక్తికి మహిళను విక్రయించగా, సదరు వ్యక్తి ఆమెను పలువురి ఇళ్లలో పనిచేసేందుకు పురమాయించడంతో పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన వారిపై ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించడంతో బాధిత మహిళ తన ఒంటికి నిప్పంటించుకుంది.
కాగా, మహిళ ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో ఘజియాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాము బాధిత మహిళ ఫిర్యాదుపై నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని యూపీ పోలీసులు వివరణ ఇచ్చారు. మహిళ ఫిర్యాదును నమోదు చేసేందుకు తిరస్కరించిన పోలీసులపై విచారణ చేపట్టాలని, బాధిత మహిళకు పరిహారం అందచేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌కు లేఖ రాశారు.
యూపీ పోలీసుల చేతిలో ఆమె పరాభవానికి లోనయ్యారని, వారి తీరుతో బాధితురాలు సజీవ దహనానికి యత్నించారని చెప్పారు. కాగా, ఈ లేఖలో వెల్లడించిన వివరాల ప్రకారం.. పలువురి వద్ద నుంచి రుణాలు తీసుకున్న ఓ వ్యక్తి రూ 10,000కు బాధిత మహిళను హపూర్‌లో కొనుగోలు చేశారు. ఆమెను తనకు అప్పు ఇచ్చిన వారి ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమెకు జీతంగా ఎలాంటి మొత్తం చెల్లించకపోవడంతో పాటు ఆమెపై ఆయా ప్రదేశాల్లో సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డారు.
తనపై వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు హూపూర్ ఎస్పీతో పాటు సీనియర్ పోలీస్ అధికారులను సంప్రదించగా ఆమె ఫిర్యాదును స్వీకరించలేదని, నిందితులపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు. పోలీసులు తీరుతో మనస్తాపం చెందిన మహిళ సజీవ దహనానికి పాల్పడింది. కాగా మహిళా కమిషన్ జోక్యంతో యూపీ పోలీసులు బాబూగఢ్ సర్పంచ్‌తో పాటు మరో 13 మందిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. మరోవైపు ఆమె సజీవ దహనానికి తనంతట తానే ప్రయత్నించిందా లేదా ఇతరుల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హపూర్ ఎస్పీ యశవీర్ సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment