ఖేల్ రత్నకు ఇద్దరి పేర్లు సిఫారుసు!
ఢిల్లీ: మన జాతీయ క్రీడైన హాకీలో సుదీర్ఘకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు సిఫారుసు చేశారు. సర్దార్ తో పాటు పారా ఒలింపియన్ దేవేందర్ ఝఝారియాను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు.
ఈ మేరకు గురువారం అవార్డుల సెలక్షన్ కమిటీ పలువురు ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసింది. ఇందులో ఇద్దరి పేర్లను ఖేల్ రత్నకు సిఫారుసు చేయగా, మరో 17 మందిని అర్జున అవార్డుల జాబితాలో చోటు కల్పించారు. అర్జునకు సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర పుజరా(పురుష క్రికెటర్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ లు ఉన్నారు.